ఏ పార్టీ తరపున పోటీ చేస్తారు?
చాలాకాలంగా తుమ్మలను కేసీఆర్ దూరం పెట్టేశారు. బీఆర్ఎస్ నుండి బయటకొచ్చేందుకు మద్దతుదారులతో తుమ్మల సమావేశాలు కూడా పెట్టుకున్నారు. తమ పార్టీలో చేరాలని ఒక వైపు కాంగ్రెస్ మరో వైపు బీజేపీ తుమ్మలపై బాగా ఒత్తిడి తెస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. గోదావరి జలాలను పాలేరు నియోజకవర్గానికి తేవాలన్నదే తన కలగా చెప్పారు. చాలా కాలం తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తనకు అవకాశం ఇచ్చారు కాబట్టే తాను జిల్లాను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవటానికే తాను అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు చెప్పారు. రైతుల కోసం పాలేరు పాత కాలువ రిపేర్లను రూ.70 కోట్లతో చేసిన విషయాన్ని తుమ్మల గుర్తు చేశారు.
తాత్కాలిక కార్యక్రమాలతో కాకుండా శాశ్వాత పనుల ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. రైతులు బాగుంటేనే జనాలందరు హ్యాపీగా ఉంటారని చెప్పారు. తుమ్మల చెప్పిందంతా బాగానే ఉంది. రాబోయే ఎన్నికల్లో పాలేరులో పోటీ చేస్తానని చెప్పారే కానీ ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనే విషయాన్ని చెప్పలేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. పాలేరులో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం తుమ్మలకు లేదు. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో తుమ్మల మీద గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కందాళం ఉపేంద్ర రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్నారు.
ఉపేంద్రకే టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ కూడా ఇచ్చారట. దాంతో తాను అధికార పార్టీ అభ్యర్థిగా కందాళం ప్రచారం కూడా చేసుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తుమ్మలకు టికెట్ అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. చాలాకాలంగా తుమ్మలను కేసీఆర్ దూరం పెట్టేశారు. బీఆర్ఎస్ నుండి బయటకొచ్చేందుకు మద్దతుదారులతో తుమ్మల సమావేశాలు కూడా పెట్టుకున్నారు. తమ పార్టీలో చేరాలని ఒక వైపు కాంగ్రెస్ మరో వైపు బీజేపీ తుమ్మలపై బాగా ఒత్తిడి తెస్తున్నాయి.
బీఆర్ఎస్‌లోనే ఉంటే తుమ్మలకు టికెట్ దక్కే అవకాశం లేదు. కాంగ్రెస్, బీజేపీల్లో చేరితే పాలేరులో టికెట్ దక్కే అవకాశముంది. కాంగ్రెస్‌లో అయితే పార్టీ ఓటు బ్యాంకు కూడా తుమ్మలకు తోడవుతుంది. బీజేపీ తరపున పోటీ చేస్తే తుమ్మల ఓట్లే పార్టీ ఓట్లు. అందుకనే ఏం చేయాలో తుమ్మలకు తోచటంలేదు. అందుబాటులోని సమాచారం ప్రకారం ఉపేంద్రను పక్కనపెట్టి టికెట్ తనకే దక్కేట్లుగా ఫైనల్‌గా తుమ్మల గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారట. మరి కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.