కాంగ్రెస్‌లోకి సబితా ఇంద్రారెడ్డి.. ఇదిగో క్లారిటీ!

సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డికి కార్పొరేషన్ పదవి ఆఫర్ చేశారని, దీంతో సబితా కాంగ్రెస్‌లో చేరేందుకు అంగీకరించారంటూ వార్తలు వచ్చాయి.

Advertisement
Update:2024-07-01 11:46 IST

తెలంగాణలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కారు దిగి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కూడా క్యూలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పార్టీ మారే అవకాశం ఉందంటూ రోజుకో ఎమ్మెల్యే పేరు తెరపైకి వస్తోంది.

ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం పార్టీ మారతారనే ప్రచారం రెండు, మూడు రోజులుగా జోరుగా సాగుతోంది. సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డికి కార్పొరేషన్ పదవి ఆఫర్ చేశారని, దీంతో సబితా కాంగ్రెస్‌లో చేరేందుకు అంగీకరించారంటూ వార్తలు వచ్చాయి. కాగా, ఈ ప్రచారంపై స్పందించారు సబితా ఇంద్రారెడ్డి. పార్టీ మార్పు వార్తలను ఖండించారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఓ పోస్టు పెట్టారు.




సబితా ఇంద్రారెడ్డి ఏమన్నారంటే!

`నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుడు ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలకు విజ్ఞప్తి. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాకు సముచితమైన స్థానం, గౌరవం కల్పించారు. పార్టీ మారాల్సిన అవసరం కానీ, ఆ ఆలోచన కానీ ఏ మాత్రం లేదు. బీఆర్ఎస్ పార్టీలోనే గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో పని చేస్తా`నంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు సబిత.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన సబితా ఇంద్రారెడ్డి.. 2018లో కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి తర్వాత అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రి పదవి సైతం దక్కించుకున్నారు. ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై మరోసారి మహేశ్వరం నుంచి విజయం సాధించారు. అయితే పార్టీ మార్పు వార్తలను సబితా తోసిపుచ్చుతున్నప్పటికీ.. ప్రచారం మాత్రం ఆగడం లేదు.

Tags:    
Advertisement

Similar News