నిన్న వరంగల్‌, ఇవాళ భువనగిరి.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం - హరీష్‌ రావు

భువనగిరి హాస్పిటల్‌లో కరెంటు కోతలు పేషంట్లకు నరకంగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు.

Advertisement
Update:2024-05-23 08:35 IST

వరంగల్‌ ఎంజీఎం హాస్పిటల్‌లో దాదాపు 5 గంటలు కరెంటు లేక పేషంట్లు ఇబ్బంది పడిన ఘటన మరువక ముందే భువనగిరి ప్రభుత్వ ఆస్ప‌త్రిలోనూ అలాంటి సీన్‌ రిపీట్‌ అయింది. కరెంటు లేకపోవడంతో పేషంట్లకు మొబైల్ టార్చ్ వెలుతురులో చికిత్స అందించారు వైద్యులు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఈ ఘటనపై స్పందించారు మాజీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో కరెంటు కోతలకు ఇంతకంటే నిదర్శనం ఏం ఉంటుందంటూ ట్వీట్ చేశారు. భువనగిరి హాస్పిటల్‌లో కరెంటు కోతలు పేషంట్లకు నరకంగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు. చివరకు ఎమర్జెన్సీ విభాగంలో విషమ పరిస్థితిలో ఉన్న పేషంట్లు సైతం నరకం అనుభవిస్తున్నారన్నారు.

ఇదేనా మార్పు అంటే.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని నిల‌దీశారు. రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని చెప్తున్న నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు పక్కనపెట్టి, పాలనపై దృష్టి సారించాలన్నారు హరీష్ రావు.

Tags:    
Advertisement

Similar News