దాటవేత, ఎత్తివేత, కోత.. కాంగ్రెస్ ప్లాన్ ఇదే - హరీష్ రావు
గత ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపిస్తూ.. దాటవేత, కోత, ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు హరీష్ రావు.
ఆరు గ్యారంటీలకు గైడ్‌లైన్స్ రూపొందించకుండానే అప్లికేషన్లు తీసుకోవటాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తప్పు పట్టారు. మీడియాతో చిట్‌చాట్ చేసిన ఆయన.. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టామని చెప్పారు. ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే అంశంపై ఇప్పటివరకూ క్లారిటీ లేదన్నారు. తెలంగాణలో ఢిల్లీ పెద్దల పోటీపై క్లారిటీ వచ్చిన తర్వాతే బీఆర్ఎస్ అభ్యర్థులపై స్పష్టత ఇస్తామన్నారు హరీష్.
లోక్‌సభ ఎన్నికల కోడ్ రాకముందే పథకాలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హరీష్ రావు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే ఆరు గ్యారెంటీ పథకాలు లేనట్లేనన్నారు. కాంగ్రెస్‌కు అవసరమైనంత టైమ్ ఉందని.. ఫిబ్రవరి 1 నుంచి పథకాలు ప్రారంభించాలన్నారు హరీష్ రావు. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపిస్తూ.. దాటవేత, కోత, ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు హరీష్ రావు. ప్రజా పాలన పేరుతో ప్రొటోకాల్ తప్పుతున్నారని.. ఓడిపోయినవారి చేత రిబ్బన్ కట్టింగ్ చేయిస్తున్నారని మండిపడ్డారు. రైతుబంధు ఎంతవరకు ఇచ్చారో వైట్ పేపర్ విడుదల చేయాలన్నారు. మేడిగడ్డ, చేవెళ్ల ప్రాజెక్టులపై త్వరలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తామన్నారు.