చెప్పేది కొండంత.. చేసేది గోరంత.. రేవంత్‌కు హరీష్ కౌంటర్
ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చి.. నియామక పత్రాలు అందజేశారా..? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు.
కొత్తగా ఎంపికైన స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి తీరు చెప్పేది కొండంత.. చేసేది గోరంత కూడా లేదన్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారని.. ఊహించినట్లుగానే తామే రిక్రూట్మెంట్ చేసినట్లు రేవంత్ డబ్బా కొట్టుకున్నారని విమర్శించారు హరీష్ రావు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌పై కల్లబొల్లి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి.. BRS ప్రభుత్వ హయాంలో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ తన అబద్ధాల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చి.. నియామక పత్రాలు అందజేశారా..? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు హరీష్ రావు. తమకు ఎలాంటి కుళ్లు, కడుపులో నొప్పి లేదన్న హరీష్ రావు.. సొమ్మొకడిది.. సోకు ఇంకొకడిది అన్నట్లుగా రేవంత్ వ్యవహరించిన తీరును తప్పు పడుతున్నామన్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే నర్సుల నియామక పత్రాలు అందించిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ఉద్యోగాలు పొందిన వారికి కూడా ఈ వాస్తవాలు తెలుసన్నారు హరీష్ రావు.
గ్రూప్-1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్లు చల్లారన్నారు హరీష్ రావు. గ్రూప్-1 గురించి రేవంత్ తన ప్రసంగంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఎన్నికల టైమ్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని నీటి మూటలేనని రేవంత్ మరోసారి నిరూపించారని మండిపడ్డారు హరీష్ రావు. అమలకు సాధ్యం కాని హామీల లిస్ట్‌లో జాబ్ క్యాలెండర్ కూడా చేరిందన్నారు. అసలు ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల బాధల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిదన్నారు హరీష్ రావు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది 10 వేల ఉద్యోగాలు మాత్రమే కదా అని గుర్తుచేశారు.
ఉద్యోగ నియామకాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్న హరీష్ రావు.. తొమ్మిదిన్నరేళ్లలో లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, మరో 40 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది వాస్తవం కాదా అని రేవంత్ సర్కార్‌ను ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన హామీని నిలుపుకుంటే స్వాగతిస్తామని, సీఎం హోదాలో తప్పుడు మాటలు చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దని సూచించారు. రోజూ అబద్ధాలు మాట్లాడే రేవంత్‌కు కాంగ్రెస్ అధిష్టానం గడ్డి పెట్టాలని కోరుతున్నానన్నారు హరీష్ రావు.