వేములవాడలో తెరపైకి మరో వారసుడు.. బీజేపీ టికెట్ ఆయనకే..?
ఇక చెన్నమనేని విద్యాసాగర్ రావు మెట్‌పల్లి నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగానూ.. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పని చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకుల వారసులు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. వేములవాడలో చెన్నమనేని కుటుంబం నుంచి కూడా మరో వారసుడు రాజకీయాల్లోకి రాబోతున్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ నేత విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. ఈనెల 30న కిషన్ రెడ్డి సమక్షంలో చెన్నమనేని వికాస్ రావు బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. ఏడాదిగా వికాస్‌రావు సైతం వేములవాడలో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ క్యాడర్‌తోనూ టచ్‌లో ఉన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని సైతం ఇటీవలే మర్యాదపూర్వకంగా కలిశారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా వేములవాడ, సిరిసిల్ల ప్రాంతంలో చెన్నమనేని కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఈ ప్రాంతంలో చెన్నమనేని కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. చెన్నమనేని రాజేశ్వర్ రావు సీపీఐ పార్టీ తరఫున రాజకీయ జీవితం ప్రారంభించి.. దాదాపు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సోదరుడు విద్యా సాగర్ రావు బీజేపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక మరో సోదరుడు హనుమంత రావు నెహ్రూ సిద్ధాంతాలను ఫాలో అయ్యేవారు. రాజీవ్‌గాంధీ హయాంలో నేషనల్ ప్లానింగ్ కమిషన్‌లో సభ్యుడిగానూ పనిచేశారు.
ఇక చెన్నమనేని విద్యాసాగర్ రావు మెట్‌పల్లి నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు కరీంనగర్ ఎంపీగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగానూ.. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2014-19 మధ్య మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం కొడుకు వికాస్ రావును వేములవాడ నుంచి పోటీ చేయించేందుకు విద్యాసాగర్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేములవాడ బీజేపీ టికెట్ వికాస్ రావుకే వస్తుందన్న ప్రచారం జోరందుకుంది.
ప్రస్తుతం వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెన్నమనేని రాజేశ్వర రావు కుమారుడు చెన్నమనేని రమేష్ బాబు ఉన్నారు. 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రమేష్ బాబు.. తెలుగుదేశం పార్టీ తరఫున వేములవాడ నుంచి బరిలో దిగి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2010లో తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2010 బైపోల్‌తో పాటు 2014, 2018లో వరుసగా వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రమేష్ బాబు. ప్రస్తుతం పౌరసత్వం వివాదం కారణంగా రమేష్ బాబుకు టికెట్ నిరాకరించారు సీఎం కేసీఆర్. ఇటీవలే ఆయనను కేబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.
*