నల్గొండలో మళ్లీ ఫ్లోరోసిస్‌ భూతం

జిల్లాలో మంత్రులు, కాంగ్రెస్‌ నేతల అరాచకాలు ఎక్కువయ్యాయ్‌

Advertisement
Update:2024-09-25 20:16 IST

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ ఫ్లోరోసిస్‌ భూతం తెరపైకి వస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా రక్షిత నీటిని సరఫరా చేయడంతో ప్రజలకు ఫ్లోరైడ్‌ పీడ కొన్నాళ్లు విరగడ అయినా, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఎక్కువ అవుతోందని తెలిపారు. దానిని అదుపు చేయడానికి ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టడం లేదన్నారు. బుధవారం మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి నివాసంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ బలోపేతంపై నాయకులతో చర్చించారు. మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్ని అంశాల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్‌ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని నల్గొండ నేతలు కేటీఆర్‌ కు వివరించారు. అధికారంలో ఉందనే అహంకారంతో మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తామని కేటీఆర్‌ అన్నారు. జిల్లాలో నెలకొన్న ఇతర సమస్యలపై పోరాడుదామని, ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి వెళ్లి ఎండగడుదామన్నారు. పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News