తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజ్
ఇంజినీరింగ్ లో 180 సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా బీటెక్ డేటా సైన్స్ కోర్సులను ఇక్కడ అందుబాటులోకి తెస్తారని తెలుస్తోంది.
తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీగా కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ అరుదైన గుర్తింపు సాధించబోతోంది. కోస్గిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ ను ఇంజినీరింగ్ కాలేజీగా మారుస్తున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదలయ్యాయి. దీంతో తెలంగాణలోనే తొలి గవర్నమెంట్ ఇంజినీరింగ్ కాలేజీగా కోస్గి గుర్తింపు తెచ్చుకుంది.
ఇంజినీరింగ్ విద్య మొదలైనప్పటినుంచి ప్రైవేటు కాలేజీలదే హవా. యూనివర్శిటీల్లో ఇంజినీరింగ్ విభాగాలు ఉన్నా కూడా అవన్నీ క్యాంపస్ లో అంతర్భాగంగానే ఉంటాయి. జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్శిటీల పరిధిలో ఈ కాలేజీలు ఉన్నాయి. పనిగట్టుకుని ప్రభుత్వ రంగంలో ఇంజినీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయలేదు. అయితే తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం చేస్తున్నారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లోని కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ ను ఇంజినీరింగ్ కాలేజీగా అప్ గ్రేడ్ చేయించారు. వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచే ఇక్కడ ఇంజినీరింగ్ ప్రవేశాలు ఉంటాయి.
తెలంగాణలో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి చరిత్ర తిరగరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నికల ప్రచారంలో కూడా ఆ అంశాన్ని హైలైట్ చేశారు నేతలు. ప్రధాని మోదీ సహకరించకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుబట్టి మరీ మెడికల్ కాలేజీలను సాధించిదని చెప్పారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి విద్యావిభాగంలో తనదైన ముద్ర చూపెట్టాలనుకుంటున్నారు. ప్రభుత్వ రంగంలో తొలి ఇంజినీరింగ్ కాలేజీని తన నియోజకవర్గంలోనే మొదటగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలో మూడు బ్రాంచ్ లు ఉన్నాయి. ఇంజినీరింగ్ లో కూడా వాటినే కొనసాగిస్తూ మరో 180 సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా బీటెక్ డేటా సైన్స్ కోర్సులను ఇక్కడ అందుబాటులోకి తెస్తారని తెలుస్తోంది. కోస్గిలో ఏర్పాటయ్యే కాలేజీ జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా ఉంటుంది.