తెలంగాణలో తొలి బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్..

మంత్రి కేటీఆర్ చొరవతో ఈ విద్యుత్ ప్లాంట్ సిద్ధమవుతోంది. కేటీఆర్‌ ఆదేశాలతో వేములవాడ పట్టణ అభివృద్ధి అథారిటీ(VTDA) ద్వారా రూ.31.60 లక్షలను మంజూరు చేశారు.

Advertisement
Update:2023-05-16 08:19 IST

తెలంగాణ రాష్ట్రంలో తొలి బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ త్వరలో వినియోగంలోకి వస్తుందని అంటున్నారు అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాల్టీ పరిధిలోని తిప్పాపూర్ లో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. జూన్-1 లోపు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కావాలంటూ మంత్రి కేటీఆర్ డెడ్ లైన్ పెట్టగా.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి. మరో రెండు వారాల్లో ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుందని స్పష్టం చేశారు అధికారులు.

గ్రీన్ ఎనర్జీవైపు అడుగులు..

పర్యావరణానికి హాని లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అణ్వేషిస్తున్నారు నిపుణులు. పవన్ విద్యుత్, సౌర విద్యుత్ అందుబాటులో ఉన్నా కూడా ఖర్చు కాస్త ఎక్కువ. వాటికి ప్రత్యామ్నాయంగా బయోగ్యాస్ తో విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి కేటీఆర్ చొరవతో ఈ విద్యుత్ ప్లాంట్ సిద్ధమవుతోంది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో వేములవాడ పట్టణ అభివృద్ధి అథారిటీ(VTDA) ద్వారా రూ.31.60 లక్షలను మంజూరు చేశారు. ఈ విద్యుత్‌ ప్లాంట్‌ ను జూన్‌ ఒకటో తేదీలోగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్‌ గతంలో ఆదేశించారు.

బయోగ్యాస్ ప్లాంట్ కి అనువైన ప్రదేశంగా తిప్పాపూర్ ని ఎంచుకున్నారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి సన్నిధికి సంబంధించిన కోడెల సంరక్షణ కేంద్రం తిప్పాపూర్ లో ఉంది. ఇక్కడ దాదాపు 200కి పైగా ఆవులు, దూడలు ఉన్నాయి. వాటి పేడ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అందుకే ఇక్కడ బయోగ్యాస్‌ ప్లాంట్‌ నిర్మిస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉండే 2.5 టన్నుల పేడను బయోగ్యాస్‌ ప్లాంట్ కి అందిస్తారు. దీని ద్వారా 30 KVA విద్యుత్‌ తయారవుతుంది. ఈ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తయ్యే పర్యావరణహిత విద్యుత్‌ను వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి, వేములవాడ రాజన్న ఆలయానికి వినియోగిస్తారు. 

Tags:    
Advertisement

Similar News