20 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు..!
సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో బీజేపీ నుంచి ఈటల, కాంగ్రెస్ టికెట్‌పై తూముకుంట నర్సారెడ్డి పోటీ చేయనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 116 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి జోరు మీదుంది. ఇక కాంగ్రెస్ 55, బీజేపీ 52 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. ఇప్పటివరకూ 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే మూడు పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. మిగతా నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీజేపీ.. మూడు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో బీజేపీ నుంచి ఈటల, కాంగ్రెస్ టికెట్‌పై తూముకుంట నర్సారెడ్డి పోటీ చేయనున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున జీవన్ రెడ్డి, బీజేపీ తరపున బోగ శ్రావణి.. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో అమితుమీ తేల్చుకోనున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గం ధర్మపురిలోనూ కాంగ్రెస్ తరపున అడ్లూరి లక్ష్మణ్, బీజేపీ తరపున ఎస్.కుమార్ పోటీకి రెడీ అయ్యారు. వీటితో మరికొన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల అభ్యర్థులు ఖరారు అయ్యారు. వాటి వివరాలు..
బెల్లంపల్లి, నిర్మల్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, ధర్మపురి, రామగుండం, మానకొండూరు, గజ్వేల్, కుత్బుల్లాపూర్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, యాకత్‌పురా, బహదూర్ పుర, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగార్జున సాగర్, స్టేషన్ ఘన్‌పూర్, భూపాల్‌పల్లి, భద్రాచలం నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. తెలంగాణలో నవంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.