కవితతో శరత్ కుమార్ భేటీ

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ద్వారా పలు రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో శరత్ కుమార్ కవితతో భేటీ కావడం ప్రాధాన్యత‌ సంతరించుకుంది.

Advertisement
Update:2023-01-28 14:17 IST

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు రాజకీయాలకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ గురించి పలు వివరాలు శరత్ కుమార్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్చిన సంగతి తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుంది.

ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలకు చెందిన కీలక నాయకులు వరుసగా కేసీఆర్ ను కలుస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇవాళ క‌విత‌తో శరత్ కుమార్ భేటీ ప్రాధాన్య‌త సంతరించుకుంది. శరత్ కుమార్ తమిళ రాజకీయాల్లో దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు. మొదట్లో ఆయన జయలలితకు మద్దతుదారుడిగా ఉంటూ అన్నాడీఎంకేలో పనిచేసేవారు. ఆ తర్వాత డీఎంకేలో కొన్ని సంవత్సరాలు పాటు ఉన్నారు.

2007లో ఆయన ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి పార్టీని ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకొని రెండు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించారు. శరత్ కుమార్ ఎన్నికల్లో గెలవడం అదొక్కసారే. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించలేదు.

సినిమాల్లో ఎంతో బిజీగా ఉండే శరత్ కుమార్ ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయంగా క్రియాశీలకంగా ఉంటారన్న విమర్శ ఉంది. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ద్వారా పలు రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో శరత్ కుమార్ కవితతో భేటీ కావడం ప్రాధాన్యత‌ సంతరించుకుంది. ఆయన బీఆర్ఎస్ పొత్తుతో తమిళనాడులో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అందువల్లే ఆయన కవితతో భేటీ అయినట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News