గురుకులాలకు తాళాలు వేసిన వారిపై కేసులు పెట్టండి

కలెక్టర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశం

Advertisement
Update:2024-10-15 13:11 IST

అద్దె కోసం గురుకుల భవనాలకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కలెక్టర్లను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. మంగళవారం మంత్రి మీడియాకు వీడియో సందేశం రిలీజ్‌ చేశారు. భవనాల గేట్లకు తాళాలు వేసిన వారిపై కేసులు పెట్టాలని ఆదేశించామన్నారు. రాష్ట్రంలోని 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని తెలిపారు. కొన్నేళ్లుగా రాని బకాయిలను అడగలేక.. తమ ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. భవనాల అద్దెల గురించి సీఎం, డిప్యూటీ సీఎం వివరాలు తెప్పించుకున్నారని, నిధుల విడుదలపై బుధవారం సమావేశం కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. నేడో, రేపో నిధులు విడుదల చేసే సమయంలో ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని తాళాలు వేయొద్దని యజమానులను కోరుతున్నానని తెలిపారు. గురుకులాలకు ఏర్పాటు చేసిన బ్యానర్లు వెంటనే తొలగించాలన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే ప్రభుత్వపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. భవనాల అద్దె బకాయిలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. గురుకులాల ప్రిన్సిపాల్స్‌, ఆర్సీవోలు ఎక్కడైన భవన యజమానులు ఇబ్బందులు పెడితే పోలీస్‌ స్టేషన్‌ లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రస్తుత భవనాలకు బదులుగా వేరే భవనాలు సమీపంలోనే అందుబాటులో ఉంటే కలెక్టర్లు వాటిని అద్దెకు తీసుకోవాలని సూచించారు. వెంటనే కొత్త భవనాలకు గురుకులాలను షిఫ్ట్‌ చేయాలని, అద్దె చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News