రైతుభరోసాపై అభిప్రాయ సేకరణ.. ఏం తేలిందంటే..?

మంత్రుల సబ్ కమిటీ రైతుల అభిప్రాయాలు సేకరిస్తోంది. గరిష్టంగా 10 ఎకరాల లోపు భూమి ఉన్నవారికే రైతుభరోసా నిధులు జమచేయాలనే ప్రతిపాదన రైతులనుంచి వచ్చింది.

Advertisement
Update:2024-07-10 16:48 IST

తెలంగాణలో రైతు భరోసా పథకం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విధి విధానాల దగ్గరే ఆగిపోయింది. ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఆర్థిక సాయం ఎవరికి చేయాలి, ఎవరిని లిస్ట్ లోనుంచి తొలగించాలి అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు నేతలు. దీనిపై మంత్రుల సబ్ కమిటీ రైతుల అభిప్రాయాలు సేకరిస్తోంది. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సమావేశంలో రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు మంత్రులు.


10ఎకరాల లోపు..

బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధుకి పెద్దగా అడ్డంకులేవీ లేవు. చిన్న, సన్నకారు రైతులనుంచి ఎక్కువ ఎకరాాల భూమి ఉన్న వారికి కూడా భూమి విస్తీర్ణం ప్రకారం రైతుబంధు జమ అయ్యేది. రైతుబంధుని రైతు భరోసాగా మార్చుతూ వ్యవసాయ కూలీలు, కౌలు రైతులకు కూడా ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. అయితే ఇంతవరకు దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు కాలేదు. రైతుల అభిప్రాయాలు సేకరించినప్పుడు గరిష్టంగా 10 ఎకరాల లోపు భూమి ఉన్నవారికే రైతుభరోసా నిధులు జమచేయాలనే ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది.

కౌలు రైతుల సంగతేంటి..?

తమ పొలాలు కౌలుకి ఇచ్చినా కూడా యజమానులే ఇప్పటి వరకు రైతుబంధు తీసుకునేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తానంటోంది. ఇక్కడ కూడా పీటముడి పడే అవకాశముంది. తమ పొలాలను కౌలుకి ఇచ్చే యజమానులు అంగీకార పత్రాలు తీసుకునే సందర్భాలు అరుదు. ఈ అంగీకార పత్రాలు ఉంటేనే కౌలు రైతుల్ని గుర్తించి వారికి ఆర్థిక సాయం చేసే అవకాశముంటుంది. దీనిపై కూడా రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు మంత్రులు. అంగీకార పత్రాలు ఇచ్చేందుకు యజమానులు సిద్ధంగా లేరని తెలుస్తోంది. దీంతో కౌలు రైతుల గుర్తింపులో జాప్యం జరిగే అవకాశముంది.

ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు పాల్గొన్నారు. ఉమ్మడి 10 జిల్లాల్లో రైతుల అభిప్రాయాలు సేకరించి రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఓ నివేదిక తయారు చేయాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News