ఆర్గానిక్ బాటలో తెలంగాణ రైతాంగం.. ఆన్ లైన్ లో అమ్మకాలు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు రైతులు తమ సేంద్రీయ ఉత్పత్తులను ఆన్ లైన్ లో కూడా అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. డోర్ డెలివరీకి కూడా ఉత్సాహం చూపిస్తున్నారు.
తెలంగాణ రైతాంగం ఇప్పుడు ఆర్గానిక్ బాట పట్టింది. ప్రజల్లో ఆరోగ్యం పట్ల పెరుగుతున్న స్పృహను అవకాశంగా చేసుకుని ఆర్గానిక్ పంటల పెంపకంపై ఆసక్తి కనబరుస్తోంది. వరంగల్ జిల్లా రైతులు రైతు వికాస్ ఆర్గానిక్ మార్ట్ పేరుతో ఔట్ లెట్లు ప్రారంభిస్తున్నారు. ఇటీవలే హన్మకొండలోని బాలసముద్రం వద్ద ఇలాంటి మార్ట్ ప్రారంభమైంది. ఇందులో కేవలం ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు మాత్రమే లభిస్తాయి. ధర కాస్త ఎక్కువైనా.. ఆరోగ్యం కోసం వీటిని వినియోగిస్తున్నారు ప్రజలు. అనారోగ్యం వచ్చాక మందులపై పెట్టే ఖర్చు, ముందుగానే తిండిపై పెట్టడం మేలని భావిస్తున్నారు.
ఉత్పత్తుల సేకరణను సమగ్రపరచడానికి, మెరుగైన ధరల కోసం మార్కెట్ లింక్ లు రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు ఉత్పత్తి సంస్థలు (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (FPO) ) అనే భావన తెరపైకి తెచ్చింది. FPOని స్థాపించడం వలన రైతులకు ప్రభుత్వం నుంచి మరింత ఆర్థిక మద్దతు లభిస్తుంది. మార్కెటింగ్ లో కూడా ప్రభుత్వం సాయం ఉంటుంది. 'సహకార సంఘం కింద ఉన్న గ్రూపులు 2014లో ఆర్గానిక్ FPOగా నమోదు చేసుకున్నాయి. వీటికి తెలంగాణ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ (TOCA) సర్టిఫికెట్లు ఇస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్ లను పరిశీలించి తనిఖీ చేసి, వాటికి ధృవీకరణ ఇస్తుంది. ఈ ధృవీకరణ పొందడానికి రైతులు మూడేళ్లుగా సేంద్రీయ సాగు చేస్తుండాలి. ఈ సర్టిఫికెట్ ఉన్న FPOలు లాభాలపంట పండిస్తున్నాయి.
ఆన్ లైన్ లోనూ అమ్మకాలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు రైతులు ఇప్పుడు తమ సేంద్రీయ ఉత్పత్తులను ఆన్ లైన్ లో కూడా అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. డోర్ డెలివరీకి కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. దళారీలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారే మార్కెటింగ్ చేస్తున్నారు. వీరికి తెలంగాణ ప్రభుత్వం నుంచి మంచి భరోసా లభిస్తోంది. 1700 మంది రైతులు సమన్వయంతో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. వీరిలో 1100 మంది వరంగల్ జిల్లాకు చెందిన వారు కాగా, 600 మంది సిద్దిపేట జిల్లాకు చెందిన వారు. వీరిలో ఎక్కువ మంది సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తిదారులుగా సర్టిఫికెట్లు పొందారు.