మరో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు - ముగ్గురి అరెస్ట్.. పరారీలో మరొకరు
హైదరాబాద్ చైతన్యపురిలో ఫ్లెక్సీ దుకాణం నిర్వహించే మిర్యాల ఆనంద్‌కుమార్ (47) మలక్‌పేటకు చెందిన రికో ఓవర్సీస్ కన్సల్టెన్సీ డైరెక్టర్ మల్లెపాక హేమంత్ (35), సరూర్‌నగర్‌లో వేఫోర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ డైరెక్టర్ కల్యాణ్‌లను కలుపుకొని ఈ వ్యవహారాన్ని నడిపాడు.
నకిలీ సర్టిఫికెట్ల ముఠాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవల వరంగల్‌లో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు.. తాజాగా హైదరాబాదులో మరో ముఠాను పట్టుకున్నారు. నకిలీ జామీను పత్రాలు, నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ లైసెన్సులు.. ఇలా నకిలీ పరంపర పెరిగిపోతుండటంతో వీరికి కళ్లెం వేసి.. కటకటాల వెనక్కి పంపేందుకు పోలీసులు నడుం బిగించారు. అందులో భాగంగానే తాజాగా నకిలీ సర్టిఫికెట్ల ఉదంతం వెలుగు చూసింది.హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ఎస్‌వోటీ, చైతన్యపురి పోలీసులు ఈ ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ బుధవారం ఈ కేసు వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మిర్యాల ఆనంద్‌కుమార్ (47) హైదరాబాద్ చైతన్యపురిలో ఫ్లెక్సీ దుకాణం నిర్వహిస్తున్నాడు. చదివింది ఫైన్ ఆర్ట్స్.. అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు నకిలీ సర్టిఫికెట్ల తయారీ చేపట్టాడు. మలక్‌పేటకు చెందిన రికో ఓవర్సీస్ కన్సల్టెన్సీ డైరెక్టర్ మల్లెపాక హేమంత్ (35), సరూర్‌నగర్‌లో వేఫోర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ డైరెక్టర్ కల్యాణ్‌లను కలుపుకొని ఈ వ్యవహారాన్ని నడిపాడు.
వీరు కాలేజీల్లో మధ్యలో చదువు మానేసినవారి వివరాలు సేకరించేవారు. ఆ విద్యార్థులు, తల్లిదండ్రులను కలిసి వారికి సర్టిఫికెట్లు ఇప్పిస్తామని, వాటి ద్వారా విదేశాలకు వెళ్లొచ్చని నమ్మించేవారు. ఆనంద్‌కుమార్ ఫొటోషాప్‌లో నకిలీ పట్టాలు తయారు చేసి తన ఫ్లెక్సీ దుకాణంలోనే ముద్రించేవాడు. ఒక్కో ధ్రువపత్రాన్ని హేమంత్, కల్యాణ్‌లకు రూ.3 వేలకు అమ్మేవాడు. వారు ఆ సర్టిఫికెట్‌కు ఒక్కొక్కరి వద్ద రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేసేవారు. ఈ సర్టిఫికెట్లు తీసుకున్నవారికి వీసా వస్తే వారి నుంచి మరికొంత సొమ్ము వసూలు చేసేవారు.
వేఫోర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ లో వీసా ప్రాసెసింగ్ కౌన్సిలర్ షేక్ షాహీన్ (30) కూడా ఇందులో భాగస్వామి అని పోలీసులు గుర్తించారు. ఆనంద్, హేమంత్, షేక్ షాహీన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కల్యాణ్ పరారీలో ఉన్నాడు. అతను కూడా దొరికితే ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెబుతున్నారు.