నకిలీ ఏసీబీ అధికారి గుట్టురట్టు.. - 200 మందికి పైగా అధికారులు అతని బాధితులు
జల్సాలకు అలవాటుపడ్డ జయకృష్ణ పెళ్లయిన ఆరు నెలలకే భార్యతో విడిపోయాడు. 2017లో గొలుసు చోరీ కేసులో జైలుకెళ్లాడు.
కొందరు ప్రభుత్వ అధికారుల అవినీతి అతనికి వరమైంది.. తాను ఏసీబీ అధికారినంటూ బెదిరించి లక్షలాది రూపాయలు కాజేశాడు. అతని బాధితులు 200 మందికి పైనే ఉన్నారంటే ఈ వ్యవహారం ఎంత చాకచక్యంగా నడిపాడో అర్థం చేసుకోవచ్చు. అవినీతి అధికారుల భయం కూడా అతను ఇంతమందిని మోసగించేందుకు అవకాశం కల్పించింది. తాజాగా శంషాబాద్ పోలీసులు ఆ నకిలీ ఏసీబీ అధికారిని అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు.
`గ్యాంగ్` సినిమా ప్రభావంతో..
నిందితుడి పేరు నూతెటి జయకృష్ణ (28). స్వస్థలం అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొట్టలపల్లి గ్రామం. బీకాం చదివిన అతను.. కొంతకాలం సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం కోసం కూడా సన్నద్ధమయ్యాడు. జల్సాలకు అలవాటుపడ్డ జయకృష్ణ పెళ్లయిన ఆరు నెలలకే భార్యతో విడిపోయాడు. 2017లో గొలుసు చోరీ కేసులో జైలుకెళ్లాడు. అక్కడ అనిల్ అనే వ్యక్తి పరిచయం కాగా.. అతని ద్వారా బెంగళూరుకు చెందిన శ్రీనాథ్ పరిచయమయ్యాడు. సూర్య నటించిన `గ్యాంగ్` సినిమా ప్రభావంతో శ్రీనాథ్, జయకృష్ణ కలిసి నకిలీ ఏసీబీ అధికారుల అవతారమెత్తారు. తొలుత డబ్బు వసూలు చేసినా అది బెడిసి కొట్టి పోలీసులకు చిక్కారు. జైలు నుంచి బయటికొచ్చాక కూడా 16 గొలుసు చోరీలు చేశాడు.
లొకేషన్ తెలియకుండా.. ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తూ..
ఆ తర్వాత టెలిఫోన్ డైరెక్టరీ, ప్రభుత్వ వెబ్‌సైట్‌ల ద్వారా ప్రభుత్వ అధికారుల ఫోన్ నంబర్లు సేకరించిన నిందితుడు.. వారికి ఫోన్లు చేసి.. ఏసీబీ మెయిన్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేవాడు. మీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.. సెటిల్ చేసుకుంటే ఓకే. లేకపోతే రైడ్ జరుగుతుందంటూ బెదిరించేవాడు. హడలిపోయే ఉద్యోగుల నుంచి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బు వసూలు చేసేవాడు. మరో విషయమేమిటంటే.. పోలీసులకు చిక్కకుండా ఉండటం కోసం ఏసీ బస్సుల్లో సిటీ అంతటా ప్రయాణిస్తూ.. అధికారులతో కాల్ మాట్లాడేవాడు. ఫోన్ నంబర్ ద్వారా తన లొకేషన్ తెలియకుండా ఈ విధంగా జాగ్రత్తపడేవాడు. ఓ బాధిత అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
రెండు రాష్ట్రాల్లోనూ కేసులు...
నిందితుడు జయకృష్ణపై ఏపీలో 32 కేసులు నమోదు కాగా, తెలంగాణలో అతని బాధితులైన ప్రభుత్వ అధికారులు 200 మందికి పైనే ఉన్నారు. ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడి వద్ద నుంచి రూ.85 వేల నగదు, 5 సిమ్ కార్డులు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాల్లోని రూ.2.24 లక్షల నగదు సీజ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ అధికారుల నుంచి ఇప్పటి వరకు లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతను తెలంగాణలోని వివిధ శాఖల అధికారుల నుంచి గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు రూ.70 లక్షల వరకు వసూలు చేసినట్టు విచారణలో వెల్లడైంది.
పట్టుకుంది ఇలా..
ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితుడు బెంగళూరులో ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో దాదాపు వారం రోజుల పాటు మాటువేసి అతని కదలికలు గమనించారు. నిందితుడు తన పని కోసం ఇటీవల హైదరాబాద్‌కు రాగా, వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు.