మందు పార్టీలకు ప్రత్యేక అనుమతి తప్పనిసరి.. ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన
ఎన్నికలకు ముందు ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. భారీగా లిక్కర్ కొనుగోలు చేయవలసి వస్తే ముందుగా అనుమతి తీసుకోవాలని ప్రకటించింది.
తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నెలకొన్న సంగతి తెలిసిందే. మరో 15 రోజుల్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలో మందు పంపిణీ షరా మామూలే. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవారు, ఇతర కార్యక్రమాలు చేపట్టేవారికి కూడా రాజకీయ నాయకులు మందు పార్టీలు ఇస్తుంటారు.
అయితే ఎన్నికలకు ముందు ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. భారీగా మద్యం కొనుగోలు చేయకుండా చెక్ పెట్టింది. భారీగా లిక్కర్ కొనుగోలు చేయవలసి వస్తే ముందుగా అనుమతి తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. సొంత అవసరాలకు మాత్రమే మద్యం కొనుగోలు చేస్తున్నట్లు బాండ్ పేపర్‌పై ప్రత్యేక హామీ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది.
ఏవైనా దావత్‌లు, శుభకార్యాలు నిర్వహించే సమయంలో కూడా తెలంగాణ ప్రజలు భారీగా మద్యం కొనుగోలు చేస్తుంటారు. అటువంటివారు కూడా తమకు రాజకీయ పార్టీలతో ఎటువంటి సంబంధం లేదని బాండ్ పేపర్‌పై సంతకం పెట్టి మద్యం కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అనుమతి తీసుకోకుండా భారీగా మద్యం కొనుగోలు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని వారు తెలిపారు.
తెలంగాణలో ఈ నెల 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 3న ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ గ్యాప్‌లో రాజకీయ పార్టీలు భారీగా మందు సరఫరా చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో ఎక్సైజ్ శాఖ కొత్త నిబంధన అమల్లోకి తీసుకురావడం ద్వారా రాజకీయ పార్టీలకు, మందు బాబులకు షాక్ ఇచ్చినట్లయింది.