బీఆర్ఎస్‌కు ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా.. కాంగ్రెస్ గూటికి ఎప్పుడంటే..?
ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా బీఆర్ఎస్‌కు ఆయన రాజీనామా చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది.
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో నేత గుడ్‌బై చెప్పారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు పంపారు. ఇంద్రకరణ్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఆదిలాబాద్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సైతం ఆయన హాజరు కాలేదు.
ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా బీఆర్ఎస్‌కు ఆయన రాజీనామా చేయడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. ఒకటి, రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. 2014లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి, కొద్ది కాలానికే బీఆర్ఎస్ గూటికి చేరారు. తెలంగాణ తొలి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన ఆయన.. రెండోసారి కూడా కేసీఆర్ కేబినెట్‌లో స్థానం సంపాదించారు.