బీజేపీలో ఈటల మంటలు..

చేరికల కమిటీ కన్వీనర్ అయిన ఈటలకు తెలియకుండా ఈ పేర్లు లీకవుతాయా..? మరి ఆయన ఆరోపణల్లో వాస్తవం ఎంత..? అసలీ లీకువీరులెవరు అనేది ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశమైంది.

Advertisement
Update:2023-01-29 11:52 IST

ఈటల చేరికతో బీజేపీ ఏమాత్రం లాభపడిందో తెలియదు కానీ, ఈటల మాటలతో మాత్రం ఇప్పుడా పార్టీ ఇరుకున పడుతోంది. ఈటలకు ఆ పార్టీలో ఎవరితోనూ సఖ్యత లేదు. తన చేరికకు పరోక్ష కారణం అయిన వివేక్ వెంకట స్వామితో గొడవలు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో ఆధిపత్యపోరు.. ఇలా ఉంది కమలంతో ఈటల సంసారం. ఇవి చాలవన్నట్టుగా కోవర్టులు, ఇన్ ఫార్మర్లు అంటూ ఆయన పెట్టిన మంట ఇప్పుడు బీజేపీని ఇరుకునపడేసింది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ కూడా. అలాంటిది ఆయనే స్వయంగా కోవర్టులంటూ ఆరోపణలు చేయడం విశేషం. అంతే కాదు, బీజేపీలో చేరబోయే ఇతర పార్టీల నేతల పేర్లు ముందుగానే లీక్ కావడంతో ఇటీవల కొందరు వెనకడుగేసిన పరిస్థితి కూడా ఉంది. చేరికల కమిటీ కన్వీనర్ అయిన ఈటలకు తెలియకుండా ఈ పేర్లు లీకవుతాయా..? మరి ఆయన ఆరోపణల్లో వాస్తవం ఎంత..? అసలీ లీకువీరులెవరు అనేది ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశమైంది. ఏ రాజకీయ పార్టీలోనూ చేరికల కోసం ప్రత్యేకంగా కమిటీ లేదని, బీజేపీలో కమిటీ ఏర్పాటు చేసినా చేరబోయే నేతల పేర్లు ప్రాథమిక దశలోనే ఎలా లీక్‌ అవుతున్నాయని పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు..?

ఇన్ఫార్మర్లు, కోవర్టులు అన్ని పార్టీల్లోనూ ఉంటారు. అయితే సమయానుకూలంగా స్పందిస్తుంటారు. కానీ ఇటీవల కాలంలోనే బీజేపీకి ఈ సమస్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ని వెనక్కు నెట్టి బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఎదుగుదామనుకుంటున్న వేళ, బీజేపీని ఇలాంటి వ్యవహారాలు చికాకు పెడుతున్నాయి. దీంతో అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై దృష్టిపెట్టింది. లీకువీరులెవరో తేల్చాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించింది.

మునుగోడుతోనే తేలిపోయిందా..?

మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నుంచి కొంతమందికి గేలమేసింది బీజేపీ. కానీ అనూహ్యంగా చివరి నిముషంలో కొంతమంది బీజేపీ నేతలు బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. డబ్బులు వెదజల్లినా మునుగోడులో బీజేపీ గెలవలేదు.

ఈటల అసంతృప్తితో ఉన్నారా..?

కోవర్టులు, ఇన్ఫార్మర్ల వ్యాఖ్యలతో ఈటల తన అసంతృప్తిని బయటపెట్టారేమోననే వాదన కూడా వినపడుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా.. ఈటల వంటి వారు బీజేపీలో ఇమడలేరని చెబుతున్నారు. దీంతో ఈటల వ్యవహారంపై మరింత కన్ఫ్యూజన్ మొదలైంది. ఇంతకీ ఈటల సమస్య ఏంటి..? బీజేపీలో ఆయనకు తగినంత గౌరవం దక్కలేదని ఫీలవుతున్నారా, లేక బండి పోస్ట్ కి ఎసరు పెట్టాలని చూస్తున్నారా..? ముందు ముందు తేలిపోతుంది. 

Tags:    
Advertisement

Similar News