చెన్నమనేనికి బీజేపీ గాలం.. టచ్‌లో ఈటల..?
రమేష్ బాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పౌరసత్వం వివాదంలో అక్టోబర్‌లో తనకు అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుందని ఆశగా ఉన్నారు రమేష్ బాబు.
BRS అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించడంతో.. టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. పలు స్థానాల్లో సిట్టింగ్‌లకు మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చోటు దక్కని కొందరు నేతలు కేసీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ సీటు దక్కకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు.
పౌరసత్వం వివాదం కారణంగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేనికి టికెట్ నిరాకరిస్తున్నట్లు చెప్పారు కేసీఆర్. ఆయన స్థానంలో చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు టికెట్ కేటాయించారు. అయితే రమేష్‌బాబు ఇప్పటివరకూ బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కార్యకర్తలు, అనుచరులు సమన్వయం పాటించాలని పిలుపునిచ్చారు. అయితే బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో.. చెన్నమనేని రమేష్‌బాబును తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ నేతలు చెన్నమనేనిని ఫోన్‌లో సంప్రదించారని తెలుస్తోంది. ఈనెల 27న అమిత్ షా ఖమ్మం రానుండగా.. అదే సభలో చెన్నమనేనికి కండువా కప్పాలని పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
అయితే రమేష్ బాబు నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పౌరసత్వం వివాదంలో అక్టోబర్‌లో తనకు అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుందని ఆశగా ఉన్నారు రమేష్ బాబు. అయితే బీఆర్ఎస్‌లోనే ఉంటూ చల్మెడ కోరినట్టుగా ఆయనకు సహకరిస్తారా..? లేదా మరో పార్టీ నుంచి పోటీ చేసి కేసీఆర్‌కు షాకిస్తారా అనేది తేలాల్సి ఉంది.
2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన టైంలో వేములవాడ కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది. అంతకుముందు సిరిసిల్ల నియోజకవర్గంలో భాగంగా ఉండేది. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి గతంలో చెన్నమనేని రమేష్ బాబు తండ్రి చెన్నమనేని రాజేశ్వర రావు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లోకి వచ్చిన రమేష్ బాబు.. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున వేములవాడ నుంచి బరిలో దిగి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2010లో తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అదే ఏడాది జరిగిన ఉపఎన్నికలో రెండో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014, 2018లో వరుసగా వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రమేష్ బాబు.
1990లో ఉద్యోగరీత్యా జర్మనీకి వెళ్లిన రమేష్ బాబు.. 1993లో జర్మనీ పౌరసత్వం పొందారు. తిరిగి 2008లో ఇండియాకు వచ్చిన రమేష్ బాబు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా..హోం మంత్రిత్వ శాఖ ఓకే చెప్పింది. అయితే నకిలీ పేపర్స్ సమర్పించి రమేష్ బాబు పౌరసత్వం పొందారని ఆరోపిస్తూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పుపై రమేష్ బాబు.. సుప్రీంకోర్టును ఆశ్రయించగా స్టే విధించింది. అప్పటి నుంచి పౌరసత్వం వివాదం కొనసాగుతూనే ఉంది.
*