పకడ్బందీగా ఓటర్ల జాబితా.. 40 ప్రత్యేక బృందాల ఏర్పాటు
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను పకడ్బందీగా రూపొందిస్తున్నామని చెప్పారు. ఇందు కోసం 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేసేందుకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఓటర్లు మార్పులు, చేర్పులు చేసుకోవడానికి.. కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఈ నెల 19 వరకు కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు అవకాశం ఉన్నది. అయితే చాలా చోట్ల అక్రమంగా ఓట్లను తొలగిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. నకిలీ ఓట్లను కూడా కొన్ని రాజకీయ పార్టీలు నమోదు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపత్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ స్పందించారు.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను పకడ్బందీగా రూపొందిస్తున్నామని చెప్పారు. ఇందు కోసం 40 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ప్రతీ టీమ్‌లో తహశీల్దార్, ఇద్దరు నాయబ్ తహశీల్దార్లు ఉంటారని చెప్పారు. ఈ ఏడాది జనవరి 5 నుంచి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు దాదాపు 17 లక్షల మంది తమ ఓటును నమోదు చేసుకున్నారు. ఇందులో 7.15 లక్షల దరఖాస్తులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయని వికాస్ రాజ్ తెలిపారు.
ఓటర్ల జాబితా సవరణ కోసం 11.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 3.77 లక్షల దరఖాస్తులు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయన్నారు. సవరణలకు ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం ఇదే తొలి సారని వికాస్ రాజ్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాలకు అనుగుణంగా ఓటర్ల జాబితాను తయారు చేస్తామని పేర్కొన్నారు. కాగా, అక్టోబర్ 4న తెలంగాణ ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారందరికీ ఈ జాబితాలో చోటు దక్కనున్నది. కాగా, ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు పూర్తి కానున్న ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఆయా వ్యక్తులు దరఖాస్తు చేసుకోవాలని వికాస్ రాజ్ కోరారు.
మారిన ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్లు..
రాష్ట్రంలోని 47 లక్షల మంది ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు మారాయి. ఉమ్మడి ఏపీలో ఓటరుగా నమోదు చేసుకున్న వారికి 'ఏపీ' కోడ్‌తో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఇప్పుడు వారికి కొత్తగా 10 అంకెలతో కూడిన నంబర్‌ను కేటాయించారు. తాజాగా ప్రకటించిన ముసాయిదా ఓటర్ల లిస్టులోనే మారిన నెంబర్లను ఎన్నికల సంఘం ప్రస్తావించింది. పాత ఓటర్లు తమ కొత్త గుర్తింపు కార్డు నంబర్ తెలుసుకోవడానికి తెలంగాణ సీఈవో వెబ్‌సైట్ (ceotelangana.nic.in)ను సందర్శించాలని వికాస్ రాజ్ కోరారు.