కేటీఆర్‌కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు.. ఎందుకంటే..?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన, ఉద్యోగాల కల్పనతో పాటు పలు అంశాలను ప్రస్తావించారని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సుర్జేవాలా ఈసీకి ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు షాకిచ్చింది ఎన్నికల కమిషన్. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రచారానికి వినియోగించుకోవడంపై వివరణ ఇవ్వాలంటూ శనివారం కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈనెల 20న టి-వర్క్స్‌లో కొలోజియం సీక్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన, ఉద్యోగాల కల్పనతో పాటు పలు అంశాలను ప్రస్తావించారని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సుర్జేవాలా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, వివరాలను పరిశీలించిన అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. కేటీఆర్‌పై వచ్చిన ఫిర్యాదులో ప్రాథమిక ఆధారాలున్నాయని ఆ నివేదికను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈసీ పేర్కొంది.
ఇక ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సైతం ప్రసంగాల విషయంలో గట్టి సూచన చేసింది ఈసీ. విద్వేషపూరిత ప్రసంగాలకు దూరంగా ఉండాలని సూచించింది. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దాడిపై స్పందిస్తూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఈసీ తప్పుపట్టింది.