ఎన్నికల కోడ్ అమల్లోకి.. భారీగా నగదు, బంగారం పట్టివేత

పలు ప్రాంతాల్లో నగదుతో పాటు ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన తాయిలాలను కూడా స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు.

Advertisement
Update:2023-10-10 08:01 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే ఎన్నికల నియమావళి కూడా అమలులోకి వచ్చింది. దీంతో సోమవారం హైదరాబాద్‌ పరిధిలో ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు.. భారీ స్థాయిలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో నగదుతో పాటు ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన తాయిలాలను కూడా స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. సరైన పత్రాలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.

తారానగర్‌లో 5.65 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 2 బైక్‌లు సీజ్‌ చేశారు.

నిజాం కాలేజ్‌ పరిసరాల్లో చేపట్టిన తనిఖీల్లో 7 కిలోల బంగారం, 300 కిలోల వెండి సీజ్‌ చేశారు.

ఫిలింనగర్‌ పరిధిలోని షేక్‌పేట నారాయణమ్మ కాలేజీ మెయిన్‌ రోడ్డు వద్ద చేపట్టిన తనిఖీల్లో ఓ కారులో ఎలాంటి రసీదు లేకుండా తరలిస్తున్న రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

మంగళహాట్‌ పరిధిలో చేపట్టిన తనిఖీల్లో రూ.15 లక్షల నగదు పట్టుబడింది.

శేరిలింగంపల్లి గోపనపల్లి తండాలో ఓటర్లకు సిద్ధంగా ఉంచిన 87 కుక్కర్లను పోలీసులు సీజ్‌ చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

వనస్థలిపురం ఆటోనగర్‌ వద్ద చేపట్టిన తనిఖీల్లో బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తి వద్ద రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు.

రాయికల్‌ టోల్‌ ప్లాజా వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ.11.5 లక్షలు పట్టుబడ్డాయి.

→ పలు ప్రాంతాల్లో బెల్టు షాపులపై ఆకస్మిక దాడులు చేసి అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News