రాజస్థాన్‌లో ప్రచారానికి తెర.. తెలంగాణకు నేతల క్యూ
బీజేపీ తరఫున ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా ప్రచారం చేయనున్నారు. ఇవాళ రాష్ట్రానికి రానున్న అమిత్ షా.. మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండనున్నారు.
రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వానికి గురువారం సాయంత్రంతో తెరపడింది. శనివారం ఆ రాష్ట్రంలోని 200 స్థానాలకు గానూ 199 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. అభ్యర్థి మరణం కారణంగా మరో స్థానంలో పోలింగ్ వాయిదా పడింది. రాజస్థాన్‌లో ప్రచారానికి తెరపడటంతో నేటి నుంచి జాతీయ నేతలంతా తెలంగాణకు క్యూ కట్టనున్నారు. నాలుగు రోజుల పాటు కాంగ్రెస్, బీజేపీ అగ్ర నేతలంతా రాష్ట్రంలోనే మకాం వేయనున్నారు. తెలంగాణలో ఈ నెల 28న ప్రచారపర్వం ముగియనుంది.
ఇప్పటికే రాష్ట్రంలో పలు దఫాలుగా ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక.. మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ రాష్ట్రానికి రానున్న ప్రియాంక మొత్తం 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం పాలకుర్తి, తర్వాత హుస్నాబాద్, సాయంత్రం కొత్తగూడెం సభల్లో పాల్గొంటారు. ఇవాళ రాత్రికి కొత్తగూడెంలో బస చేయనున్న ప్రియాంక.. రేపు సత్తుపల్లి, పాలేరు, మధిర, ఖమ్మం నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఇక శనివారం రాష్ట్రానికి రానున్న రాహుల్ గాంధీ బోధన్, ఆదిలాబాద్, వేములవాడ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభలకు హాజరవుతారు.
బీజేపీ తరఫున ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా ప్రచారం చేయనున్నారు. ఇవాళ రాష్ట్రానికి రానున్న అమిత్ షా.. మూడు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండనున్నారు. మధ్యాహ్నం ఆర్మూర్ బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. తర్వాత హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్‌పేట్ రోడ్‌షోల్లో పాల్గొంటారు. ఇక మరో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ మేడ్చల్, కార్వాన్, కంటోన్మెంట్ నియోజకవర్గాలను చుట్టేస్తారు. శనివారం రాష్ట్రానికి రానున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. హుజూర్‌నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు.
శనివారం రాష్ట్రానికి రానున్న ప్రధాని మోడీ సైతం మూడు రోజుల పాటు రాష్ట్రంలో సుడిగాలి ప్రచారం చేయనున్నారు. 25, 26, 27 తేదీల్లో ప్రచారంలో పాల్గొంటారు. చివరి రోజు హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు.