సీఎం కేసీఆర్ పాలనలో వృద్ధులు, వికలాంగులకు ఆత్మగౌరవం పెరిగింది : మంత్రి హరీశ్ రావు

గాంధీభవన్‌లో కూర్చుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఏమీ అర్థం కాదని.. ఊర్లలోకి వచ్చి అవ్వ, తాతలను అడిగి తెలుసుకుంటే అన్ని విషయాలు అర్థమవుతాయని మంత్రి అన్నారు.

Advertisement
Update:2023-06-09 14:23 IST

సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులకు ఆత్మగౌరవం పెరిగింది. అత్తా కోడళ్ల పంచాయితీలు బందయ్యాయి. వీటన్నింటికీ కారణం కేసీఆర్ అమలు చేస్తున్న సంకేమ పథకాలే. సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగం అని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ రోజు సిద్దిపేటలో నిర్వహించిన సంక్షేమ ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

గాంధీభవన్‌లో కూర్చుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఏమీ అర్థం కాదని.. ఊర్లలోకి వచ్చి అవ్వ, తాతలను అడిగి తెలుసుకుంటే అన్ని విషయాలు అర్థమవుతాయని మంత్రి అన్నారు. తెలంగాణలో తప్ప బీడీ కార్మికులకు ఏ రాష్ట్రంలో అయినా పెన్షన్ ఇస్తున్నారా అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సంపదను పెంచి.. పేదలకు పంచారు. ఇంటికి పెద్దకొడుకులా నెలనెలా వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో పేదింటిలో వెలుగులు నింపుతున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.

సీఎం కేసీఆర్ ఒక మేనమామలా రాష్ట్రంలోని 12.71 లక్షల మందికి పెళ్లిళ్లు చేశారని అన్నారు. తొమ్మిదేళ్లలో ఆసరా పెన్షన్ల కింద రూ.59 వేల కోట్లు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. అన్ని కులాలకు సంక్షేమ భవన్‌లు నిర్మిస్తున్నాము. ఇంటింటి నల్లా నీటిని సరఫరా చేస్తున్నామని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రెండు, మూడు రోజులకు ఒకసారి మంచి నీళ్లు వచ్చేవని.. ఇప్పుడు మిషన్ భగీరథ కారణంగా సురక్షితమైన నీళ్లు ఇంటింటికీ అందుతున్నాయని అన్నారు.

కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా విద్య, వైద్య రంగాల్లో రాష్ట్రం అత్యంత అభివృద్ధి చెందిందని మంత్రి చెప్పారు. సిద్దిపేట జిల్లాలో 12 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశాము. ఆ స్కూల్స్‌లో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం పోటీ ఏర్పడిందని చెప్పారు. సిద్ధిపేటను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చినట్లు మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 33 వేల బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తుంటే.. బీజేపీ నాయకులు మాత్రం తామే మెడికల్ కాలేజీలు తెచ్చామని అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ నాయకుల తీరు సొమ్మొకడిది.. సోకొకడిది అన్నట్లు ఉందన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఒక్క మెడికల్ కాలేజైనా తెచ్చాడా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News