రేషన్ కార్డుల ఈకేవైసీ గడువు పొడిగింపు.. అక్కడే ఉంది మతలబు
ఈకేవైసీ పూర్తి చేయనివారు ఆందోళనకు గురవుతున్నారు. అందుకే ప్రభుత్వం పొడిగింపు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు అధికారులు. అయితే అసలు విషయం మాత్రం వేరే ఉంది.
తెలంగాణలో రేషన్ కార్డులు ఈకేవైసీ చేసుకోనివారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెలరోజులపాటు గడువు పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. జనవరి 31తో ఈకేవైసీ గడువు పూర్తవుతుండగా.. మరో నెలరోజులపాటు డెడ్ లైన్ పొడిగించింది ప్రభుత్వం. ఈకేవైసీ చేయించుకోనివారికి ఇది ఊరటనిచ్చే నిర్ణయమే అయినా.. రేషన్ కార్డులతో ముడిపడిన ఆరు గ్యారెంటీల అమలుని నెలరోజులపాటు అధికారికంగా వాయిదా వేయడానికి ఇది మరో ఎత్తుగడ అని ప్రతిపక్షాలు అసలు పాయింట్ బయటపెట్టాయి.
అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఎన్నికల హామీగా పేర్కొంది కాంగ్రెస్. కొత్తగా ఇచ్చే ఆసరా పెన్షన్లతోపాటు ఇతర పథకాలకు కూడా ఈ కొత్త రేషన్ కార్డులను ముడిపెట్టింది. ఆలోగా పాతవాటిని ప్రక్షాళణ చేసేందుకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. అంటే ఈకేవైసీ పూర్తయితేనే పాత కార్డుల లెక్క తేలుతుంది, కొత్త కార్డుల పని మొదలవుతుంది. నెలరోజులు గడువు పెంచారు కాబట్టి కొత్త కార్డుల విషయంలో కూడా ఆ గడువు ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అంటే రేషన్ కార్డ్ ఆధారంగా ఇచ్చే ఇతర పథకాలను కూడా వాయిదా వేయొచ్చనమాట.
రాష్ట్రం ఏదయినా బోగస్ రేషన్ కార్డులు సహజం. వాటిని ఏరివేసి అసలైన లబ్ధిదారులకే ప్రయోజనాలు అందేలా చూస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఈకేవైసీపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. ఈ నెలాఖరు వరకు గడువు ఇచ్చినా ఇప్పటి వరకు కేవలం 75.56 శాతం కార్డులకు మాత్రమే ఈకేవైసీ పూర్తయింది. అంటే మిగతా వారికి వచ్చే నెలనుంచి రేషన్ సరకులు ఇవ్వరు, రేషన్ కార్డులు అనుసంధానమైన పథకాలు కూడా నిలిపివేసే అవకాశముంది. దీంతో ఈకేవైసీ పూర్తి చేయనివారు ఆందోళనకు గురవుతున్నారు. అందుకే ప్రభుత్వం పొడిగింపు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు అధికారులు. అయితే అసలు విషయం మాత్రం వేరే ఉంది. ఈకేవైసీ గడువు పెంచుకుంటూ పోయి, కొత్త కార్డుల దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి మరింత టైమ్ తీసుకుంటోంది ప్రభుత్వం.