కేసీఆర్‌ వాహనాలకు ఏపీలో బుల్లెట్ ప్రూఫ్

బుల్లెట్ ప్రూఫ్‌ చేయించేందుకు ఏపీ విజయవాడ సమీపంలోని వీరపనేని గూడెం వద్ద సంబంధిత సంస్థకు చెందిన యూనిట్‌కు కొత్త వాహనాలను తెలంగాణ పోలీసులు తరలించారు.

Advertisement
Update:2022-07-24 07:06 IST

తెలంగాణలో వచ్చేది ఎన్నికల ఏడాది కావడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. పాతబడిన వాహనాల స్థానంలో కొత్త వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ కోసం నూతన కాన్వాయ్‌ వాహనాలను రెడీ చేస్తున్నారు. ఎనిమిది టయోటా ల్యాండ్ క్రూజర్ వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్‌ చేయిస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్‌ చేయించేందుకు ఏపీ విజయవాడ సమీపంలోని వీరపనేని గూడెం వద్ద సంబంధిత సంస్థకు చెందిన యూనిట్‌కు కొత్త వాహనాలను తెలంగాణ పోలీసులు తరలించారు.

ప్రత్యేక కార్గో విమానంలో రెండు రోజుల క్రితం ఈ వాహనాలను గన్నవరం ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వీరపనేని గూడెం యూనిట్‌కు తరలించారు. సీఎం పర్యటనకు అనువుగా రెండు బస్సులకు కూడా బుల్లెట్ ప్రూఫ్‌ చేయిస్తున్నారు.

ఇది వరకు బుల్లెట్‌ ప్రూఫ్‌ చేయించాలంటే జార్ఖండ్‌కు వాహనాలను తీసుకెళ్లేవారు. ఇప్పుడు సంబంధిత కంపెనీ విజయవాడ సమీపంలోని వీరపనేని గూడెంలో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాంతో ఏపీ, తమిళనాడు, తెలంగాణ, కర్నాటక, ఒడిశా తదితర రాష్ట్రాల వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ చేయించేందుకు ఇక్కడికే వాహనాలను తీసుకొస్తున్నారు. వారం పదిరోజుల్లో కేసీఆర్‌ కొత్త వాహనాలకు బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు పూర్తయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ వాడే వాహనాలు తెలుపు రంగులో ఉండనున్నాయి.

Tags:    
Advertisement

Similar News