ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అంజనీ కుమార్‌ను ఈసీ సస్పెండ్ చేసింది. దీనిపై ఇటీవల అంజనీ కుమార్ ఈసీకి వివరణ ఇచ్చారు.
తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్‌పై ఉన్న సస్పెన్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాష్ట్ర డీజీపీగా ఉన్న అంజనీ కుమార్.. కౌంటింగ్ పూర్తి కాకముందే రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు.
ఫలితాల ప్రకటన పూర్తి కాకముందే డీజీపీ అంజనీ కుమార్ రేవంత్ రెడ్డిని కలిసి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీఆర్ఎస్ విమర్శలు చేసింది. దీంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అంజనీ కుమార్‌ను ఈసీ సస్పెండ్ చేసింది. దీనిపై ఇటీవల అంజనీ కుమార్ ఈసీకి వివరణ ఇచ్చారు.
తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని, ఎన్నికల ఫలితాల రోజున కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పిలిస్తేనే తాను ఆయన నివాసానికి వెళ్లినట్లు వివరించారు. మరోసారి ఈ విధంగా జరగదని అంజనీ కుమార్ ఈసీకి హామీ ఇచ్చారు. అంజనీ కుమార్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఈసీ.. ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చింది.