కొరఢా ఝూలిపించిన ఈసీ.. 20 మంది అధికారులపై వేటు

ఓటర్ల జాబితా రూపకల్పనతో పాటు ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి తీసుకున్న చర్యల సందర్భంగా ఈసీ పలువురు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.

Advertisement
Update:2023-10-12 07:26 IST

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కీలక స్థానాల్లో పని చేస్తున్న 20 మంది అధికారులపై వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి స్పష్టం చేసింది. ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణలో వీరి పని తీరు సంతృప్తికరంగా లేనందువల్లే ఆయా అధికారులను విధుల నుంచి తప్పించాలంటూ ఈ మేరకు సీఎస్‌కు నాలుగు లేఖలను పంపించింది.

ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సుమారు నెల రోజుల ముందు నుంచే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగాలను కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దింపింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు ఈ నెల 3 నుంచి రాష్ట్రంలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, వివిధ విభాగాలకు చెందిన అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

కాగా, ఓటర్ల జాబితా రూపకల్పనతో పాటు ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి తీసుకున్న చర్యల సందర్భంగా ఈసీ పలువురు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. పలు స్థాయిల్లో జరిగిన అధికారుల బదిలీలపై కూడా అసహనం వ్యక్తం చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రాజకీయ పార్టీల విచ్చలవిడి డబ్బు, మద్యం పంపిణీపై అడ్డుకట్ట వేయక పోవడంపై ఈసీ మండిపడినట్లు తెలుస్తున్నది. అక్రమంగా తరలిస్తున్న డబ్బును స్వాధీనం చేసుకోకుండా ఉదాసీనత ప్రదర్శించినట్లు కూడా వారిపై ఈసీ ఆరోపణలు గుప్పించింది. ఈ క్రమంలోనే 20 మంది అధికారులను పూర్తిగా పక్కన పెట్టింది.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్. హరీశ్, మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ డి.అమోయ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ జిల్లా కలెక్టర్ కె.వరుణ్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, వరంగల్ కమిషనర్ ఏవీ రంగనాథ్, నిజామాబాద్ కమిషనర్ వి. సత్యనారాయణ, సంగారెడ్డి ఎస్పీ ఎం. రమణకుమార్, కామారెడ్డి ఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎస్పీ ఏ.భాస్కర్, మహబూబ్‌నగర్ ఎస్పీ కే.నరసింహ, నాగర్‌కర్నూల్ ఎస్పీ ఏ. మనోహర్, జోగులాంబ-గద్వాల ఎస్పీ కే.సృజన, నారాయణపేట ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ ఎస్పీ జి.చంద్రమోహన్, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ పి.కరుణాకర్, సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, రవాణా శాఖ కార్యదర్శి కేఎన్ శ్రీనివాసరాజు, ఆబ్కారీ శాఖ డైరెక్టర్ మహ్మద్ ముషరఫ్ అలీని విధుల నుంచి ఈసీ తప్పించింది. ఎన్నికల ముగిసే వరకు వీరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించ వద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

కాగా రాష్ట్రంలో తప్పించిన అధికారుల స్థానంలో ప్రత్యామ్నాయ అధికారుల జాబితాను పంపాలని సీఎస్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఒక్కో అధికారి స్థానంలో ముగ్గురితో కూడిన జాబితాను రూపొందించి పంపాలని కోరింది. కాగా, ప్రస్తుతానికికి హైదరాబాద్ కమిషనర్ ఆనంద్ స్థానంలో అదనపు కమిషనర్ విక్రంసింగ్ మాన్‌కు, వరంగల్ కమిషన్ ఏవీ రంగనాథ్ బాధ్యతలను డీసీపీ మురళీధర్‌కు, నిజామాబాద్ కమిషన్ర సత్యనారాయణ బాధ్యతలు డీసీపీ జయరామ్‌కు అప్పగిస్తూ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    
Advertisement

Similar News