రేవంత్‌ పాలనలో వేతనాలు అందక రోడ్డెక్కుతున్న ఉద్యోగులు

నెలలు గడుస్తున్నా వేతనాలు చెల్లించకపోవడటం పట్ల ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం

Advertisement
Update:2025-01-18 16:34 IST

ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి చిరు ఉద్యోగుల కష్టాలు కనిపించకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేసామని ఢిల్లీకి వెళ్లి అబద్ధాలు ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ పాలనలో వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కుతున్న దుస్థితి నెలకొన్నదని ధ్వజమెత్తారు.

నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులు, మూడు నెలలుగా ఉపాధి హామీ ఉద్యోగులు, నెల గడిచినా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక వెతలు పడుతున్నారు. ఉపాధి హామీ లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓలు ఇలా వేలాది మంది చిరు ఉద్యోగులు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్న దయనీయ పరిస్థితి నెలకొన్నది.

దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. నెలలు గడిచినా వేతనాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారమై, అప్పుల పాలవుతున్నారు. కండ్లు కాయలు కేసులా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు.

కుర్చీ కాపాడుకోవడం కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టడం, విదేశాలకు వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామనే డబ్బా ప్రచారం చేసుకోవడం మానేసి పాలనపై దృష్టి సారించాలని హరీశ్‌ సూచించారు. ఇప్పటికైనా చిరు ఉద్యోగులందరికీ సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు. 

Tags:    
Advertisement

Similar News