చెరువులు నిండుగా.. 3 పంటలు ఖాయంగా..!

తెలంగాణవ్యాప్తంగా 46 వేలకు పైగా జలవనరులు అందుబాటులో ఉండగా.. వాటిలో 34 వేలకు పైగా చెరువులను ప్రభుత్వం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించింది.

Advertisement
Update:2023-08-08 14:46 IST

తెలంగాణలో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటివరకూ జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించిన చెరువులన్నీ 95 శాతానికి పైగా నిండి.. నీటితో కళకళలాడుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత మిషన్ కాకతీయ పథకాన్ని అమల్లోకి తెచ్చిన కేసీఆర్ ప్రభుత్వం.. ఈ దిశగా ఉన్నత ఫలితాలు సాధించిన విషయాన్ని.. జలకళతో ఉట్టిపడుతున్న చెరువులు చెప్పకనే చెబుతున్నాయి. ముందుగా పూడిక‌తీతతో మొదలుపెట్టి.. తర్వాత చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేసిన తీరుతోనే ఇంతటి ఉన్నతమైన ఫలితాలు సాధించినట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి ఆనందాతిరేకం వ్యక్తమవుతోంది.

అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం.. తెలంగాణవ్యాప్తంగా 46 వేలకు పైగా జలవనరులు అందుబాటులో ఉండగా.. వాటిలో 34 వేలకు పైగా చెరువులను ప్రభుత్వం జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించింది. ఇందులో.. సుమారు 18 వేల చెరువులు వంద శాతం నిండగా.. మరో 3 వేల చెరువులు 95 శాతం వరకు నీటిని కలిగి రైతాంగాన్ని ఆనందంలో ముంచెత్తుతున్నాయి.

ఇటీవల రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు.. చెరువులు పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా మరమ్మతులు చేయడంతో పాటుగా పూడికతీత వంటి పనులు చేసిన కారణంగానే.. భారీ వర్షాలను సైతం చెరువులు తట్టుకుని ఇలా నిండుకుండలా తయారైనట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

చెరువులు నిండిన తీరుతో.. వాటిపై ఆధారపడిన రైతాంగం నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కాలం కలిసొస్తే.. 2 పంటలు కాదు.. ఏకంగా 3 పంటలు కూడా పండిస్తాం.. తెలంగాణలో ధాన్యపు రాశులను కురిపిస్తాం అన్న మాట వారి నుంచి ఆనందంగా వినిపిస్తోంది. ఇప్పటికే ధాన్యం దిగుబడిలో రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ.. ఇకపై ఆ ఘనతను నిలబెట్టుకోవడం ఖాయమన్న విశ్వాసం కూడా అంతటా వ్యక్తమవుతోంది.

ఇంకా వర్షాకాలం పూర్తి కానే లేదు. కనీసం ఇంకో 3 నెలలపాటు.. అంటే వచ్చే అక్టోబర్ వరకూ వర్షాలు కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ లెక్కన.. రైతులు ఇప్పుడు చెరువుల్లో నిండిన నీటిని పంటలకు వాడుకున్నా.. తర్వాత మళ్లీ చెరువులు వానలతో నిండడం దాదాపుగా ఖాయమే. ఈ లెక్కన 3 పంటలతో.. తెలంగాణలో ధాన్యపు రాశులు గలగలమనడం కూడా ఖాయమని చెప్పొచ్చు.

Tags:    
Advertisement

Similar News