నేడు దుబ్బాక బంద్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన

బీఆర్ఎస్ నేతలు రఘునందన్ రావు ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. ఆ ఫ్లెక్సీలను తగలబెట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం దారుణం అని మండిపడ్డారు.

Advertisement
Update:2023-10-31 08:59 IST

దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలో బంద్ కొనసాగుతోంది. ఉదయం నుంచి పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఉదయాన్నే బీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపాయి. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో ప్రతిపక్షాలు రక్తపుటేరులు పారించాలని చూస్తున్నాయని మండిపడ్డారు నేతలు.

రఘునందన్ దిష్టిబొమ్మ దహనం..

ఎంపీని కత్తితో పొడిచిన నిందితుడు రాజు.. కాంగ్రెస్ చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతూ కథనాలు వస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతలు రఘునందన్ రావు ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. ఆ ఫ్లెక్సీలను తగలబెట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం దారుణం అని మండిపడ్డారు.

ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిన అనంతరం ఒక్కసారిగా దుబ్బాక ఉలిక్కిపడింది. సిద్ధిపేట జిల్లావ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. దుబ్బాక, దౌల్తాబాద్‌, రాయపోల్‌, మిరుదొడ్డి, తొగుట, చేగుంట, నార్సింగ్‌ మండలాల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ర్యాలీలు నిర్వహించాయి. ఈరోజు ఉదయంనుంచే దుబ్బాక పట్టణం బోసిపోయింది. ఎక్కడా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు మొదలు కాలేదు. ఉదయం 11 గంటలకు నల్లజెండాలతో పార్టీ శ్రేణులు నిరసన చేపడతాయి. సాయంత్రం వరకు ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు స్థానిక నేతలు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని పలుచోట్ల స్థానిక ఆలయాల్లో పూజలు నిర్వహించారు. 

Tags:    
Advertisement

Similar News