డీఎస్సీ కూడా వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
నవంబర్ 20నుంచి 30 వరకు డీఎస్సీ జరగాల్సి ఉంది. సరిగ్గా తెలంగాణ పోలింగ్ తేదీ నవంబర్-30 కావడంతో డీఎస్సీ నిర్వహణ అసాధ్యంగా మారింది. దీంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రకటించారు.
తెలంగాణలో ఎన్నికల కారణంగా నిరుద్యోగులు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే గ్రూప్-2 వాయిదా పడగా, తాజాగా డీఎస్సీ కూడా వాయిదా పడింది. అయితే డీఎస్సీ విషయంలో షెడ్యూల్ రాగానే అభ్యర్థులకు సీన్ అర్థమైపోయింది. ఇప్పుడు అధికారికంగా డీఎస్సీ వాయిదా అంటూ ప్రకటన విడుదలైంది.
నవంబర్ 20నుంచి 30 వరకు డీఎస్సీ జరగాల్సి ఉంది. మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు, ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ దశలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సరిగ్గా తెలంగాణ పోలింగ్ తేదీ నవంబర్-30 కావడంతో డీఎస్సీ నిర్వహణ అసాధ్యంగా మారింది. దీంతో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రకటించారు. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారామె.
ఇటీవల గ్రూప్- 2 పరీక్షలను TSPSC రీషెడ్యూల్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కష్టమని భావించిన TSPSC గ్రూప్- 2 వాయిదా వేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను.. వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలకు వాయిదా వేసింది. దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు గ్రూప్-2 కోసం దరఖాస్తు చేసుకున్నారు.