కాంట్రాక్టు టీచర్లుగా డీఎస్సీ -2008 బాధితులు

నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Advertisement
Update:2025-02-14 23:10 IST

డీఎస్సీ -2008 పరీక్షలో సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా ఎంపికై అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు పొందని వారిని రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు టీచర్లుగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2008 డీఎస్సీలో అర్హత సాధించి ఉద్యోగాలు దక్కని 1,382 మంది కోర్టుకు వెళ్లగా వారికి ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌జీటీ క్యాడర్‌ లో వారందరినీ కాంట్రాక్టుగా టీచర్లుగా నియమిస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఒక్కో టీచర్‌ కు నెలకు రూ.31,040 కన్సాలిడేటెడ్‌ రెమ్యూనరేషన్‌ గా అందజేస్తామని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఇచ్చిన స్థానిక కోటా మేరకు ఎంపికైన కాంట్రాక్ట్‌ టీచర్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తూ పోస్టింగ్‌ లు ఇవ్వాలని ఆదేశించింది. కాంట్రాక్టు టీచర్లుగా నియమితులైన వారు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకే ఉద్యోగాల్లో చేరుతున్నామని రూ.100 స్టాంప్‌ పేపర్‌ పై అగ్రిమెంట్‌ రాసి ఇవ్వాలని ఆదేశించింది.  డీఎస్సీ -2008 బాధితులకు ప్రభుత్వ టీచర్లుగా ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అప్పుడు అర్హత సాధించిన వారందరికీ ఉద్యోగాలు ఇస్తూ కేబినెట్‌ లో నిర్ణయం కూడా తీసుకున్నది. అయినా నెలల తరబడి జాప్యం కావడంతో బాధితులు పలుమార్లు ప్రజావాణిలో ఆందోళనలు చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం వారిని కాంట్రాక్టు టీచర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    
Advertisement

Similar News