రెడ్డీ.. నీవల్లనే నేను ప్రధానిగా ఉన్నా- వైఎస్‌తో మన్మోహన్
ఏపీ నుంచి అత్యధిక సంఖ్యలో ఎంపీలు గెలవడం వల్లనే మన్మోహన్ సింగ్ ప్రధాని కాగలిగారన్నారు. 2004లో యూపీఏ అధికారంలోకి రావడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక శిల్పి అని అన్నారు.
జలయజ్ఞం- పోలవరం- ఒక సాహసి ప్రయాణం పేరుతో వైఎస్‌ఆర్‌పై మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రచించిన పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ నారాయణ, పొన్నాల లక్ష్మయ్య, కామినేని శ్రీనివాస్‌తో పాటు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బార్ హాజరయ్యారు. పుస్తకాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో సంజయ్ బార్ కీలక విషయాలు చెప్పారు. ఏపీ నుంచి అత్యధిక సంఖ్యలో ఎంపీలు గెలవడం వల్లనే మన్మోహన్ సింగ్ ప్రధాని కాగలిగారన్నారు. 2004లో యూపీఏ అధికారంలోకి రావడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక శిల్పి అని అన్నారు.
2004లో తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ ఢిల్లీ వస్తున్నారని తెలుసుకున్న మన్మోహన్ సింగ్.. వ్యక్తిగతంగా వెళ్లి వైఎస్‌ఆర్‌ను రిసీవ్ చేసుకుని తీసుకురావాల్సిందిగా తనను ఆదేశించారని సంజయ్ బార్ చెప్పారు. వైఎస్‌ఆర్‌ను చూడగానే మన్మోహన్ సింగ్ చెప్పిన తొలి మాట.. ''డాక్టర్ రెడ్డి ఐయామ్ హియర్ బికాజ్ యూఆర్ దేర్'' అని అన్నారని బార్ వివరించారు. డాక్టర్ రెడ్డి మీ వల్లనే నేను ప్రధానిగా ఉన్నాను అన్న మాట ఆ ఒక్కసారే కాకుండా రెండుమూడు సందర్బాల్లో మన్మోహన్ సింగ్ అనడం తాను స్వయంగా విన్నానన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగానే అక్కడ వైఎస్‌ఆర్ విగ్రహం ఉంటుందని తాను ఆశిస్తున్నానని సంజయ్ బార్ వ్యాఖ్యానించారు.