తుది ఓటర్ల జాబితా విడుదలపై సందిగ్దత!
సెప్టెంబర్ 18 వరకు కొత్త ఓటర్ల కోసం 13.06 లక్షలు, పేర్ల తొలగింపుకు 6.26 లక్షలు, సవరణల కోసం 7.77 దరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబర్ నాటికి తెలంగాణలో 3.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. కొత్తగా 14.72 లక్షల మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు.
తెలంగాణ తుది ఓటర్ల జాబితా విడుదలపై సందిగ్దత నెలకొన్నది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4 (బుధవారం) తుది ఓటర్ల జాబితాను విడుదల చేయవలసి ఉన్నది. కానీ రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి కార్యాలయం నుంచి దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇంత వరకు బయటకు రాలేదు. మరో వారం రోజుల్లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందనే అంచనాల నేపథ్యంలో తుది ఓటర్ల జాబితాపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదు, అడ్రస్ మార్పు, ఓట్ల తొలగింపుపై భారీగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిష్కరించే పనిలో అధికారులు ఉన్నారు.
సెప్టెంబర్ 18 వరకు కొత్త ఓటర్ల కోసం 13.06 లక్షలు, పేర్ల తొలగింపుకు 6.26 లక్షలు, సవరణల కోసం 7.77 దరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబర్ నాటికి తెలంగాణలో 3.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. కొత్తగా 14.72 లక్షల మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో బుధవారం తుది ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉన్నది. అయితే పలు రాజకీయ పార్టీలో డూప్లికేట్ ఓట్లపై ఫిర్యాదు చేశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పలు నియోజకవర్గాల్లో డూప్లికేట్, డబ్లింగ్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ సమస్యను పూర్తిగా పరిష్కరించేంత తరకు తుది ఓటర్ల జాబితా విడుదల చేయవద్దని డిమాండ్ చేస్తోంది.
ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటిస్తున్నది. ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అయ్యింది. అక్కడ కూడా కాంగ్రెస్ తుది ఓటర్ల జాబితాపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో ఇవ్వాళ తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తారా? లేదంటే మరి కొన్ని రోజులు సమయం తీసుకుంటారా? అనే సందిగ్దత నెలకొన్నది. హైదరాబాద్‌లోనే ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్ తుది ఓటర్ల జాబితా ముద్రణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాత్రిలోగా జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.