హైదరాబాద్ లో నేడు 'డబుల్' ధమాకా

ప్రస్తుతం 11,700 మందికి ఇళ్లు కేటాయిస్తున్నా.. రెండు వారాల్లో మరో జాబితా ప్రకటిస్తామన్నారు మంత్రి తలసాని. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను.. రెండు వారాలకోసారి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు.

Advertisement
Update:2023-09-02 08:11 IST

హైదరాబాద్ లో తమకంటూ సొంత గూడు ఉండాలనే పేద ప్రజల ఆశ నెరవేరే రోజు వచ్చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఈ రోజు 11,700మందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేస్తారు మంత్రులు, వారి కళ్లలో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూస్తారు. దాదాపు 24 నియోజకవర్గాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేసి ఏ ఒక్కరికీ నష్టం జరగకుండా జాబితా రూపొందించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9 ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వీరికి అందజేస్తారు.

టార్గెట్ లక్ష.. దరఖాస్తులు 7 లక్షలకు పైగా..

జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన. దానికి తగ్గట్టుగానే పనులు వేగంగా జరిగాయి. అయితే ప్రజల నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఏకంగా 7 లక్షలమందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. వివిధ దశల్లో ఆ దరఖాస్తులను వడపోసి 95వేల మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. తొలి దశలో 11,700 మందికి నేడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నారు. మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి సహా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ ఇళ్ల కేటాయింపులో పాల్గొంటారు. మొత్తం 9 ప్రాంతాల్లో ఈ రోజు ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.


నిరంతర ప్రక్రియగా..

ప్రస్తుతం 11,700మందికే ఇళ్లు కేటాయిస్తున్నా.. రెండు వారాల్లో మరో జాబితా ప్రకటిస్తామన్నారు మంత్రి తలసాని. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను.. రెండు వారాలకోసారి లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపారు. తొలి దశలో ఇళ్లు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆశావహులకు భరోసా ఇచ్చారు. మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఎప్పుడైనా గృహప్రవేశం చేసుకోవచ్చని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ పూర్తయిన తర్వాత గృహలక్ష్మి పథకం అమలు జోరందుకుంటుంది. గృహలక్ష్మి పథకం ద్వారా పేదవారికి సొంత ఇంటి నిర్మాణంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. 


Tags:    
Advertisement

Similar News