ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఎవరిచ్చారో కూడా తెలియదా?
అది తమ కుటుంబానిదని నిరూపిస్తే మీకే రాసిస్తా : కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి తలసాని సవాల్
పీసీసీ అధ్యక్షుడు, మంత్రి, ఎంపీకి ఇథనాల్ ఫ్యాక్టరీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారో కూడా తెలియదా అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం అనుమతులిస్తే బీఆర్‌ఎస్ ఇచ్చిందని తప్పుడు ఆరోపణలు చేయడం ఏమిటని మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇథనాలు కంపెనీకి తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై, తమ కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు. ఆరోపణలు నిరూపిస్తే దానిని వాళ్లకే రాసిస్తానని సవాల్ విసిరారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 2016లో తన కుమారుడు రాజమండ్రి ప్రాంతంలో కంపెనీ పెట్టాలని అనుకున్నది నిజమేనని.. మూడు నెలలకే ఆ కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చాడని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లు ఆచితూచి మాట్లాడాలని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడం చేతకాకనే కాంగ్రెస్ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు.