బొజ్జ ఉంటే ప్రమోషన్లు ఇవ్వకండి.. పోలీసులపై మంత్రి మల్లారెడ్డి సెటైర్లు
బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్‌లను కోరారు. పోలీసులు అంటే ఫిట్‌గా ఉండాలి. బొర్రలు పెంచుకుంటే నేరస్థులను ఎలా పట్టుకుంటారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ మంత్రుల్లో మల్లారెడ్డి రూటే సెపరేటు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పూయిస్తుంటారు. చిన్నప్పటి నుంచి తాను చేసిన పనులన్నింటినీ నిర్మొహమాటంగా చెబుతుంటారు. ఈ రోజు మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలకు అధిపతిని అయినా.. ఒకప్పుడు పాలు, పూలు అమ్మిన విషయాన్ని ప్రతీ వేదికపై పంచుకుంటారు. మీడియాతో మాట్లాడినా, ఇతర వేదికలపై మాట్లాడినా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఉంటే.. ఆ జోష్ వేరుగా ఉంటుంది.
తాజాగా మంత్రి మల్లారెడ్డి పోలీసులపై చేసిన సెటైరికల్ కామెంట్లు అందరికీ నవ్వులు తెప్పించాయి. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పోచారం మున్సిపాలిటీ యానంపేటలో మల్కాజిగిరి జోన్‌లో కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఏర్పడిన కొత్త పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ..
బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్‌లను కోరారు. పోలీసులు అంటే ఫిట్‌గా ఉండాలి. బొర్రలు పెంచుకుంటే నేరస్థులను ఎలా పట్టుకుంటారని వ్యాఖ్యానించారు. పోలీసులు ఫిట్‌నెస్‌ను పెంచుకోవడానికి స్టేషన్లలోనే జిమ్‌లు ఏర్పాటు చేయాలని ఆయన మంత్రి, డీజీపీలను కోరారు. దాని వల్ల వారి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందని సూచించారు.
దేశంలోనే ప్రస్తుతం తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ నెంబర్ వన్ స్థానంలో ఉందని.. మన పోలీసులు బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు. కేసులను తొందరగా పరిష్కరించడంలో తెలంగాణ పోలీస్ చాలా చొరవ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. నేను ఎలాగైతే ఫిట్‌గా ఉన్నానో.. పోలీసులు కూడా మంచి ఫిట్‌నెస్ కలిగి ఉండాలని అన్నారు. పోలీసులను చూస్తే దొంగలు గజగజ వణికిపోయేలా కండలు పెంచాలని వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి మల్లారెడ్డి మాటలకు మహమూద్ అలీతో పాటు అక్కడకు వచ్చిన పోలీసు అధికారులు కూడా నవ్వుల్లో మునిగిపోయారు.
ప్రజల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటాం : హోం మంత్రి మహమూద్ అలీ
తెలంగాణ పోలీస్ శాంతి భద్రతల నిర్వహణలో అద్భుతంగా పని చేస్తోందని అన్నారు. నగరంలోని మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమేరాల వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజా శ్రేయస్సు, భద్రత కోసం మరిన్ని పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని.. అందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి తోడ్పాటు అందిస్తామని ఆయన తెలిపారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని సీసీ టీవీ కెమేరాలు అనుసంధానం చేయబడ్డాయని.. దీని వల్ల నేర పరిశోధన మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.
రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ద్వారా ఈ ప్రాంతంలో నేర శాతం తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోచారం ఐటీ కారిడార్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఇక్కడ ప్రపంచస్థాయి కార్పొరేట్ కంపెనీలు, ఐటీ కంపెనీలు పని చేస్తున్నాయని అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ చౌహాన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాచకొండ జాయింట్ కమిషనర్ సత్యనారాయణ, ఎస్ఓటీ డీసీపీలు గిరిధర్, మురళీధర్, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) నర్మద, జిల్లా జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ దయాకర్ రెడ్డి, పోచారం స్థానిక చైర్మన్ కొండల రెడ్డి, వైస్ చైర్మన్ నాయక్, కౌన్సిలర్ ధనలక్ష్మి, ఏసీపీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.