కుటుంబ సర్వేపై అనుమానాలొద్దు.. సమాచారం గోప్యంగా ఉంటుంది
సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
కుటుంబ సర్వేపై ఎలాంటి అనుమానాలొద్దని, ప్రజల సమాచారం గోప్యంగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ లో మోసర్ల ప్రతాప్ రెడ్డి నివాసంలో కుటంబ సర్వేలో మంత్రి పాల్గొన్నారు. ఈ సర్వే చారిత్రాత్మకమైనదని, గవర్నర్ తన వివరాలు ఇచ్చారని తెలిపారు. ప్రజాప్రతినిధులు కుటుంబ సర్వేలో పాలు పంచుకోవాలని సూచించారు. అన్ని కుల సంఘాలు సర్వేలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కులం బలం ఎంతో తెలిస్తే ఆ కుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. మనిషి బాడీకి ఎక్స్ రే ఎట్లనో కుల గణన సర్వే కూడా అలాంటిదేనని తెలిపారు. ప్రజలందరూ సర్వేలో సమాచారం ఇవ్వాలని సూచించారు.
రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తరలించిన పొన్నం
మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ పర్యటనకు వెళ్తుండగా ఆదివారం ఉదయం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం రామచంద్రపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాన్ ను ఆటో వెనుక నుంచి ఢీకొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తోన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గాయపడ్డ వారిని పరామర్శించారు. అంబులెన్స్ పిలిపించి బాధితులను ఆస్పత్రికి పంపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ తో ఫోన్ మాట్లాడి ఆదేశించారు.