నేను డాలర్.. ఆయన చెల్లని 2వేల నోటు

ఇప్పుడు డాలర్ వర్సెస్ 2వేల నోటు అంటూ కరెన్సీ పోలిక తెచ్చి మరీ తిట్టుకుంటున్నారు. ఎన్నికల టైమ్ దగ్గరపడేకొద్దీ వీరిమధ్య పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశముంది.

Advertisement
Update:2023-11-10 13:30 IST

తెలంగాణ ఎన్నికల్లో ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ లో ఈటల నామినేషన్ వేయడం, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి బరిలో దిగడంతో ఆ రెండు నియోజకవర్గాలపై అందరి దృష్టి నెలకొంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగింది. ఇక్కడ బలమైన ప్రత్యర్థులు బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి పోటీగా ఈసారి కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య మాటల తూటాలు ఓ రేంజ్ లో పేలుతున్నాయి.

డాలర్ వర్సెస్ 2వేల నోటు..

పువ్వాడ, తుమ్మల మధ్య వ్యక్తిగత ఆరోపణలు కూడా తారా స్థాయికి చేరుకున్నాయి. భూ కబ్జాలు, అవినీతి అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇటీవల వరకు ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా, ఇప్పుడు అనుకోకుండా ప్రత్యర్థులయ్యారు. దీంతో విమర్శలు మరింతగా పెరిగాయి. తాను డాలర్ లాంటి వాడినని, ఎక్కడైనా చెల్లుతానంటున్నారు పువ్వాడ అజయ్. తుమ్మల నాగేశ్వరరావు 2వేల రూపాయల నోటులాంటి వారని, అది రద్దయిపోయిందని, ఆయన ఎక్కడా చెల్లుబాటు కాడంటూ సెటైర్లు పేల్చారు.

ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటన కూడా ఇక్కడ పొలిటికల్ హీట్ పెంచింది. పువ్వు లాంటి పువ్వాడను గెలిపించాలని, తుమ్మలు, తుప్పలు మనకు వద్దన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు తుమ్మల కూడా అంతే ఘాటుగా బదులిచ్చారు. ఆ తర్వాత పువ్వాడ, తుమ్మల మధ్య కూడా మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పుడు డాలర్ వర్సెస్ 2వేల నోటు అంటూ కరెన్సీ పోలిక తెచ్చి మరీ తిట్టుకుంటున్నారు. ఎన్నికల టైమ్ దగ్గరపడేకొద్దీ వీరిమధ్య పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశముంది. ఖమ్మం ఖరీదైన ఎన్నిక అనే ప్రచారం కూడా జరుగుతోంది. 

Tags:    
Advertisement

Similar News