వైజాగ్ స్టీల్‌పై మాట్లాడటానికి కేటీఆర్‌కు హక్కేముంది? విమర్శకుల నోళ్లు మూయించిన మంత్రి కేటీఆర్
2021 నుంచి వైజాగ్ స్టీల్ ప్లాట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నా అభిప్రాయాలను వెల్లడిస్తున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కని, తన కార్పొరేట్ మిత్రులకు లాభం చేకూర్చడం కోసమే దాన్ని ప్రైవేట్‌పరం చేస్తున్నారని కేటీఆర్ ఒక బహిరంగ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. తమ ప్లాంట్ కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మద్దతు తెలపడంపై అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అయ్యింది. అయితే, సోషల్ మీడియాలో కొంత మంది కేటీఆర్‌కు అసలు ఏ హక్కు ఉందని వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. ఆయనది తెలంగాణ అయితే ఆంధ్రా ప్రాంతంలోని ఫ్యాక్టరీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని అన్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
'వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ మాట్లాడటానికి కేటీఆర్‌కు ఏం హక్కు ఉందని కొంత మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై నేను ఈ రోజే కొత్తగా మాట్లాడటం లేదు. 2021 నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నా అభిప్రాయాలను వెల్లడిస్తున్నాను. అంతే కాకుండా స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న పోరాటానికి నా సంఘీభావాన్ని కూడా తెలియజేశాను' అని కేటీఆర్ చెప్పారు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ రోజు నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకపోతే.. ఈ మోడీ ప్రభుత్వం రేపు సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మాట్లాడటానికి మాకు ఎవరు మద్దతుగా ఉంటారని కేటీఆర్ పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రముఖ థియోలజిస్ట్ మార్టిన్ నిమాలర్ చెప్పిన మాటలను కూడా పోస్టు చేశారు.
'మొదట వాళ్లు కమ్యూనిస్టుల దగ్గరకు వచ్చారు. అయితే నేను కమ్యూనిస్టును కాదు కాబట్టి నాకెందుకు అని పట్టించుకోలేదు. తర్వాత వాళ్లు సోషలిస్టుల దగ్గరకు వచ్చారు. ఈ సారి నేను సోషలిస్టును కాదు కాబట్టి నాకెందుకులే అని ఊరుకున్నాను. తర్వాత వాళ్లు ట్రేడ్ యూనియన్ లీడర్ల దగ్గరకు వచ్చారు. యధావిధిగా నాకెందుకులే అని వదిలేశా. ఈ సారి వాళ్లు యూదుల దగ్గరకు వచ్చారు. మళ్లీ నాకెందుకు అని పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్లు నా వద్దకు వచ్చారు. కానీ.. నా గురించి మాట్లాడటానికి ఎవరూ మిగల్లేదు' అనే సూక్తిని కూడా ట్వీట్ చేశారు. గతంలో రాహుల్ గాంధీని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించిన సమయంలో కూడా ఇదే సూక్తిని గుర్తు చేశారు.