14న దొడ్డి కొమరయ్య కురమ ఆత్మగౌరవ భవనం ప్రారంభం
భారీ జన సమీకరణ చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ శివారుల్లోని కోకాపేటలో నిర్మించిన దొడ్డి కొమరయ్య కురమ సంఘం ఆత్మ గౌరవ భవనాన్ని ఈనెల 14న ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం సెక్రటేరియట్‌లో ఈ కార్యక్రమంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. దొడ్డి కొమరయ్య భవనం ప్రారంభోత్సవంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ, కర్నాటక ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారని తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించే సభలో కనీసం 30 వేల మంది పాల్గొనేలా జన సమీకరణ చేయాలని ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశంకు మంత్రి సూచించారు. భవనానికి అవసరమైన కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ సహా ఇతర పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ఉన్నతాధికారులు శ్రీధర్, సర్ఫరాజ్ అహ్మద్, బాలమాయాదేవి, ఇలంబర్తి, హరీశ్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.