బట్టతలకు పెన్షన్ కు ముడి వేసిన కథ తెలుసా ?
సిద్దిపేట జిల్లా కోహెడలో నిన్న బట్టతల బాధితులు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిపి ఓ కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. వెల్లి బాలయ్య అనే బట్టతల వ్యక్తి అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
పెన్షన్ ఎవరికిస్తారు? మనకు తెలిసి పని చేసుకోలేని వృద్దులకు.... భర్త పిల్లలు లేక జీవితం కష్టమైన ఒంటరి మహిళలకు... వికలాంగులకు...ఇలా అతి కొద్ది మందికి మాత్రమే ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది. ఆ కనీస పెన్షన్ సొమ్ము కూడా లేకపోతే వారు బతకలేరనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ పెన్షన్ పథకాలు చేపట్టాయి.
ఇక ప్రతి ఒక్కరూ, పని చేసుకోగల్గినవాళ్ళు, ఉద్యోగాలున్నవాళ్ళు, ఉపాధి ఉన్నవాళ్ళు యువకులు కూడా తమకు పెన్షన్ కావాలని అడిగితే ? అడిగితే కాదు అలానే డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు.
'మోకాలికి బట్టతలకు ముడేయడం' అంటే తెలుసు కదా! ఇక్కడ బట్టతల రాయుళ్ళు అదే చేశారు. అసలు కథలోకి వెళ్తే.... సిద్దిపేట జిల్లా కోహెడలో నిన్న బట్టతల బాధితులు సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిపి ఓ కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు. వెల్లి బాలయ్య అనే బట్టతల వ్యక్తి అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ప్రధాన కార్యదర్శిగా రాజేశం, కోశాధికారిగా మౌటం రాము తదితరులు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు బాలయ్య మాట్లాడుతూ బట్టతల ఉన్న వాళ్ళు సమాజంలో అనేక అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోందని, అందువల్ల బట్టతల వాళ్ళను వికలాంగులుగా గుర్తించి 6 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అది కూడా ఈ సంక్రాంతి లోపు తమ డిమాండ్ తీర్చాలన్నారు. ఒక వేళ ప్రభుత్వం కనక తమ డిమాండ్ పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బట్టతల బాధితుల సంఘం ఏర్పాటు చేసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని, పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇలా బట్టతలకు పెన్షన్ కు ముడేయలాన్న ఆలోచన 'నభూతో నభివష్యతి' కదా !