ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ఎక్కడో తెలుసా..?
ఢిల్లీలో కేంద్ర పార్టీ కార్యాలయానికి ఆఫీస్ కూడా సిద్ధమవుతోంది. ఆరు నెలలు తాత్కాలిక భవనంలో ఉండి, ఆ తర్వాత కొత్త భవనంలోకి మారేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత దానికి సంబంధించిన పరిణామాలన్నీ వేగంగా జరిగిపోతున్నాయి. పార్టీ మీటింగ్ తర్వాత వెంటనే టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ని కలసి పార్టీ పేరు మార్పుకోసం దరఖాస్తు అందించారు. ఈలోగా అటు ఢిల్లీలో కేంద్ర పార్టీ కార్యాలయానికి ఆఫీస్ కూడా సిద్ధమవుతోంది. ఆరు నెలలు తాత్కాలిక భవనంలో ఉండి, ఆ తర్వాత కొత్త భవనంలోకి మారేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
పటేల్ రోడ్డులో బంగళా..
దేశ రాజధానిలో సర్దార్ పటేల్ రోడ్డులోని 5వ నంబరు బంగళాను బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం కోసం అద్దెకు తీసుకున్నారు. ఇటీవలే ఎంపీ సంతోష్ కుమార్ ఈ భవనాన్ని పరిశీలించి ఖరారు చేశారు. ఈ భవనం రాజస్థాన్ రాజవంశానికి చెందిన ఖైతడి ట్రస్టుకు చెందినది. ఈ భవనం ప్రాంగణం సువిశాలంగా ఉంటుంది. ఏడాది కాలానికి ఈ బిల్డింగ్ ని లీజుకు తీసుకున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లు, ఆఫీస్ కి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసి, ఫర్నిచర్ ని కూడా సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో ఈ బిల్డింగ్ పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలకోసం అందుబాటులోకి వస్తుంది.
ఆరు నెలల్లో పర్మినెంట్ బిల్డింగ్..
గతంలో టీఆర్‌ఎస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కూడా భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 6 నెలల్లో ఈ నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత అద్దె భవనం నుంచి నూతన భవనానికి కార్యాలయాన్ని మారుస్తామని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. అప్పటి వరకు బీఆర్ఎస్ కేరాఫ్ సర్దార్ పటేల్ రోడ్ అనమాట.