కాంగ్రెస్‌కు మిత్రపక్షాల దూరం.. కేటీఆర్ ట్వీట్..!
మోసం కాంగ్రెస్ నైజం అన్నారు కేటీఆర్. నయవంచనకు నిలువెత్తు రూపం కాంగ్రెస్ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బీటలు వారుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పంజాబ్‌లో ఆప్, బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించాయి. ఇక కూటమి ఏర్పడేందుకు తీవ్రంగా కృషి చేసిన జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం కాంగ్రెస్‌కు షాకిచ్చి మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
మోసం కాంగ్రెస్ నైజం అన్నారు కేటీఆర్. నయవంచనకు నిలువెత్తు రూపం కాంగ్రెస్ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. అందుకే ఆదిలోనే ఇండియా కూటమి బీటలు వారుతోందన్నారు కేటీఆర్. అందుకే కాంగ్రెస్‌ను వీడి టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరి పోరుకు నిర్ణయం తీసుకున్నాయన్నారు కేటీఆర్. కనీసం మిత్ర పక్షాలను ఒప్పించలేని కాంగ్రెస్.. దేశ ప్రజలను ఏం మెప్పిస్తుందని ప్రశ్నించారు. మోడీని, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదని.. ఇండియా కూటమికి అంతకన్నా లేదన్నారు. మిత్రపక్షాలు దూరం కావడమే ఇందుకు కారణమన్నారు.
దేశ ప్రజల చూపు ప్రాంతీయ శక్తులవైపే ఉందన్నారు కేటీఆర్. తెలంగాణలో కేసీఆర్, బెంగాల్‌లో మమతా దీదీ, పంజాబ్, ఢిల్లీలో కేజ్రీవాల్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేది రాష్ట్రాల్లో బలమైన పార్టీలేనన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కథ ఖతం అన్నారు కేటీఆర్. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ప్రాంతీయ శక్తుల పాత్రే కీలకం కాబోతుందన్నారు కేటీఆర్.