ఆ కుక్కల మధ్య.. మేయర్‌ని వదిలేయండి..! - తనదైన స్టైల్‌లో స్పందించిన వర్మ
కేటీఆర్ సార్.. నగరంలోని 5 లక్షల కుక్కలను డాగ్ హోమ్‌కు తరలించి, వాటి మధ్య మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని వదిలేయండి.. అంటూ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో బాలుడు మృతిచెందిన ఘటనపై సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తనదైన శైలిలో స్పందించారు. వరుస ట్వీట్లతో విమర్శల జడివాన కురిపించారు. వీధి కుక్కల నియంత్రణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.
ఈ ఘటన విషయంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇచ్చిన వివరణపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇంతకీ ఈ ఘటనపై మేయర్ వివరణ ఏమిటో తెలుసా.. `శునకాలకు ఆకలి వేయడం వల్లే దాడి చేశాయి` అని. అది కూడా గతంలో ఆమె తన పెంపుడు కుక్కతో కలిసి ఉన్న వీడియోను పంచుకుంటూ ఇలా స్పందించారు.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ.. కేటీఆర్ సార్.. నగరంలోని 5 లక్షల కుక్కలను డాగ్ హోమ్‌కు తరలించి, వాటి మధ్య మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని వదిలేయండి.. అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. వరుస ట్వీట్లతో మేయర్‌పై వర్మ విమర్శలు చేశారు. `శునకాల నుంచి ప్రజలకు హాని కలగకుండా ఉండాలంటే.. మేయర్ విజయలక్ష్మికి నా ఆలోచన చెబుతా.. నగరంలోని అన్ని శునకాలకూ ఈ వీడియో చూపిస్తే.. ఆకలి వేసినప్పుడల్లా చిన్నారులపై దాడి చేయకుండా మేయర్ ఇంటికి వెళతాయి. అలాగే.. ఆ హృదయ విదారక వీడియోను ఆమెకు తరచూ చూపించాలి.
అప్పుడే ఆమె చెత్త సలహాలు ఇవ్వకుండా ఉంటారు. కిల్లర్ డాగ్స్‌కు ఆమె నిజమైన నాయకురాలేమో అని నాకు అనిపిస్తోంది. చిన్నారిపై దాడి చేసిన శునకాలకు బహుశా ఆమే శిక్షణ ఇచ్చి ఉంటారని అనుమానం కలుగుతోంది.. అంటూ వర్మ మండిపడ్డారు.
మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేయాలని వర్మ కోరారు. ఇంత జరిగినా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ గద్వాల్ విజయలక్ష్మి తన మేయర్ పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదు.. అని ప్రశ్నించారు. కుక్కల దాడి ఘటనపై హైకోర్టు స్పందించడాన్ని వర్మ స్వాగతించారు.