కాంగ్రెస్ బీసీ నాయకులకు ఏఐసీసీ హ్యాండ్ ఇచ్చిందా?

బీఆర్ఎస్ పార్టీ బీసీలకు 22 సీట్లు ఇచ్చింది. కాంగ్రెస్ 34 సీట్లు ఇచ్చి బీసీలను ఆకట్టుకోవాలని ఆ వర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement
Update:2023-10-01 11:21 IST

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి టికెట్ల ఖరారుపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు రోజుల తరబడి కొనసాగుతూనే ఉన్నది. పార్టీలోకి కొత్త నాయకులు చేరుతుండటం, బీసీ నాయకులు ప్రతీ లోక్‌సభ పరిధిలో రెండు అసెంబ్లీ టికెట్లు డిమాండ్ చేస్తుండటంతో జాబితాపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌లోని బీసీ నాయకులు పలు దఫాలు సమావేశమై 34 టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలన్నీ మీడియా ముందు వెల్లడించడంతో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వాళ్లకు గట్టి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తున్నది.

బీఆర్ఎస్ పార్టీ బీసీలకు 22 సీట్లు ఇచ్చింది. కాంగ్రెస్ 34 సీట్లు ఇచ్చి బీసీలను ఆకట్టుకోవాలని ఆ వర్గం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీసీల్లో కీలకంగా ఉన్న ముఖ్య నాయకులందరికీ టికెట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే అధిష్టానం వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లు తెలుస్తున్నది. 25 నుంచి 28 టికెట్లు మాత్రమే కేటాయించగలమని చెప్పినట్లు పార్టీ విశ్వసనీయ వర్గాల సమాచారం. బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లే ఇస్తుండటంతో పెద్దగా నష్టమేమీ లేదని ఏఐసీసీ కూడా అంచనాకు వచ్చిందని తెలుస్తున్నది.

ఇక బీసీల్లోని ముఖ్యనాయకులు అందరికీ టికెట్లు సర్థబాటు చేయడం కష్టమని తేల్చేసినట్లు సమాచారం. బీసీ నాయకులు అందించిన లిస్టులోని కొంత మంది వల్ల రాబోయే ఎన్నికల్లో నష్టం కలిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఢిల్లీ పెద్దలు చెప్పినట్లు తెలిసింది. బీసీ నాయకులు అధిష్టానానికి కూలంకషంగా వివరించినా.. సానుకూలంగా స్పందించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా మీడియా వద్దకు పదే పదే వెళ్తుండంపై రివర్స్‌లో క్లాస్ తీసుకోవడంతో బీసీ నాయకులు అవాక్కయ్యారు.

టీపీసీసీ రికమెండ్ చేసిన అభ్యర్థుల్లో కేవలం గెలిచే అవకాశాలు ఉన్న నాయకులను మాత్రమే తీసుకున్నామని.. పార్టీ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు వారితో స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కొంత మంది బీసీ నాయకులకు టికెట్లు రాకపోవచ్చని.. త్యాగాలకు సిద్ధంగా ఉండాలని అధిష్టానం తేల్చేసింది.

గతంలో కంటే, బీఆర్ఎస్ కంటే ఎక్కువ టికెట్లే ఇస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఏఐసీసీ అంచనా వేస్తోంది. దీంతో బీసీ నాయకులు కూడా ప్రస్తుతానికి సైలెంట్ అయ్యినట్లు సమాచారం. మొదట్లో ఓకే చెప్పినా.. చివరకు ఇలా హ్యాండ్ ఇవ్వడంతో కొంత మంది తమకు టికెట్లు రావేమో అనే ఆందోళనలో ఉన్నారు. టికెట్లు కన్ఫార్మ్ అయ్యాక భవిష్యత్ కార్యచరణపై ఆలోచిస్తామని కొంత మంది సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News