టీఆరెస్ ఎమ్మెల్యేపై హత్యకు కుట్ర.. నిందితుడు నేపాల్ ఎందుకు వెళ్ళొచ్చాడు ?
టీఆరెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర చేసినట్టుగా అనుమానిస్తున్న ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను తుపాకీ కొనడానికి నాలుగు రోజుల క్రితం నేపాల్ వెళ్ళివచ్చినట్టు పోలీసు వర్గాల సమాచారం.
టీఆరెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు జరిగిన కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వారి ఇన్వెస్టిగేషన్ లో ఒక్కొక్కటిగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు ప్రసాద్ గౌడ్.. నాలుగు రోజుల క్రితమే నేపాల్ వెళ్లి వచ్చాడని, అక్కడ వెపన్ కొని, ఓ సుపారీ గ్యాంగ్ ని కలిశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఉండే జీవన్ రెడ్డి ఇంటి మూడో ఫ్లోర్ లోకి గౌడ్ ఎలా వెళ్ళాడన్న దానిపై ఎంక్వయిరీ కూడా ప్రారంభమైంది. మంగళవారం ఉదయం బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ ఏసీపీ సుదర్శన్.... జీవన్ రెడ్డి ఇంటిని సందర్శించి ప్రాథమిక విచారణ జరిపారు. నిన్న రాత్రి మూడో అంతస్థులో జీవన్ రెడ్డి ఉన్నారన్న సమాచారాన్ని తెలుసుకుని గౌడ్ ఆయన బెడ్ రూమ్ లో ప్రవేశించాడని, అయితే అలర్ట్ గా ఉన్న జీవన్ రెడ్డి గట్టిగా కేకలు పెట్టడంతో కిందికి పరుగులు తీశాడని తెలుస్తోంది. గేటు బయట సిబ్బంది అతడిని పట్టుకున్నట్టు సమాచారం.
ఆర్మూర్ లోని కల్లెడ సర్పంచ్ గా ఉన్న తన భార్య లావణ్యను పదవి నుంచి దించడంలో జీవన్ రెడ్డి హస్తం ఉందన్న కక్షతో ప్రసాద్ గౌడ్ ఆయనపై హత్యాయత్నానికి కుట్ర పన్నినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లోగడ జీవన్ రెడ్డిని 'ఖబడ్డార్' అని బెదిరిస్తూ గౌడ్ చేసిన హెచ్చరిక తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. గౌడ్ నుంచి కత్తిని, రెండు పిస్టల్స్ ని వారు స్వాధీనం చేసుకున్నారు. గన్స్ కొనుగోలు విషయంలో ప్రసాద్ తన ఫోన్ లో జరిపిన చాటింగ్ ని వారు గుర్తించారు.
'నా భర్తను కావాలనే కేసులో ఇరికించారు'
ఈ కేసులో తన భర్తను కావాలనే ఇరికించారని ప్రసాద్ గౌడ్ భార్య లావణ్య ఆరోపిస్తోంది. తన పదవి విషయమై ఎమ్మెల్యేను కలుస్తూనే ఉన్నామని, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే బిల్లులు ఆపుతున్నారని ఆమె పేర్కొంది. జీవన్ రెడ్డిని కలవడానికే తన భర్త వెళ్లారని లావణ్య చెబుతోంది. ఇదంతా కుట్ర అని ఆమె వాపోయింది.