ధరణి స్పెషల్ డ్రైవ్.. కాంగ్రెస్ సమర్థత తేలుతుందా..?

రాష్ట్రంలోని అన్ని తహశీల్దార్‌ కార్యాలయాల్లో ‘ధరణి’దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తారు. దీనికోసం జిల్లా కలెక్టర్లు తహశీల్‌ కార్యాలయ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు.

Advertisement
Update:2024-03-01 07:48 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధరణి పోర్టల్ వ్యవహారంపై తీవ్ర చర్చ జరిగింది. ధరణితో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే వెంటనే ఆ వ్యవస్థను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ధరణిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనుకున్నట్టుగానే ధరణిపై ఫోకస్ పెట్టారు నేతలు. అయితే ఇప్పటికిప్పుడు ధరణిని పూర్తిగా రద్దు చేయలేదు. పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి కొత్త ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

కాంగ్రెస్ చెప్పినట్టు గతంలో నిజంగానే సమస్యలుంటే వాటిని ఈ ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంటుంది. ఈరోజు నుంచి ఈనెల 9 వరకు ధరణి స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెండింగ్‌లో ఉన్న సుమారు 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహణ కోసం భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) నవీన్‌ మిట్టల్‌ ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా చొరవ చూపి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.

ఎమ్మార్వో ఆఫీసుల్లో..

రాష్ట్రంలోని అన్ని తహశీల్దార్‌ కార్యాలయాల్లో ‘ధరణి’దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తారు. దీనికోసం జిల్లా కలెక్టర్లు తహశీల్‌ కార్యాలయ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వారికి శిక్షణ కూడా ఇప్పించారు. పహాణీ, అడంగల్, ధరణిలో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా పెండింగ్‌ దరఖాస్తులను, వాటితోపాటు వచ్చిన డాక్యుమెంట్లను ఈ బృందాలు పరిశీలిస్తాయి. అవసరమనుకుంటే క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరుపుతాయి. చివరిగా నివేదిక రూపొందించి.. సదరు దరఖాస్తును ఆమోదించాలా, తిరస్కరించాలా అనేది పొందుపరుస్తారు. పెండింగ్ లో ఉన్న అన్ని దరఖాస్తుల్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ స్పెషల్ డ్రైవ్ తర్వాత కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంటుందా, లేక ఈ విధానం ద్వారా వారు తమకు న్యాయం జరిగిందని అనుకుంటారా అనేది తేలాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News